శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు టిటిడి సారె

తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సారె సమర్పించారు. మే 8వ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 15వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను తిరుపతి గంగమ్మ ఆలయ పాలకమండలి అధ్యక్షులు శ్రీ ఆర్‌సి.మునికృష్ణకు టిటిడి ఈవో అందజేశారు. అక్కడి నుంచి మేళతాళాల మధ్య ఊరేగింపుగా సారెను గంగమ్మ ఆలయానికి తీసుకెళ్లారు.

tatayyagunta gangamma

ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఏటా చైత్ర మాసంలో జాతర సందర్భంగా నాలుగో రోజున అమ్మవారికి టిటిడి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను, వారి జీవన విధానాలను ప్రతిబింబించేలా అపురూపంగా జాతర జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులు బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి, సున్నపుకుండలు, పేరంటాలు తదితర వేషాలను ధరించి అమ్మవారిని దర్శించుకుంటారని వివరించారు.

అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ పార్థసారధిస్వామి, శ్రీగోదాదేవి, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని టిటిడి ఈవో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

Source