
ఇందులో భాగంగా తెల్లవారుజామున 12.30 గంటలకు యాగశాలలో స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు రుత్వికులు సంకల్ప పూజ నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ మహాపూర్ణాహుతి, మంగళ హారతి జరిగింది. ఉదయం 4.00 నుండి 4.30 గంటల మధ్య యాగశాల నుండి కుంభాలు, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా ఆలయాలలో యధాస్థానానికి వేంచేపు చేశారు.
[gallery columns="2" size="full" ids="1811,1810"]
ఉదయం 4.30 నుండి 6.30 గంటల వరకు మీనలగ్నంలో శ్రీగోవిందరాజస్వామివారి గర్భాలయ శిఖరంపై యాగశాల నుండి తీసుకువచ్చిన కలశాలలోని పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీగోవిందరాజస్వామివారి మూలమూర్తికి కలశంలోని జలాలతో సంప్రోక్షణ చేసి, ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, సన్నిధిలోని ద్వారపాలకులు, గరుడాళ్వారు, ధ్వజస్తంభం, ఎదురు ఆంజనేయస్వామివారు, భాష్యకార్లు, కురత్తాళ్వార్, మధురకవి ఆళ్వార్, మొదలియాండన్ ఆలయాల మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఉదయం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాసంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గతంలో 2004వ సంవత్సరం మే నెలలో ఈ కార్యక్రమం టిటిడి ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇదివరకు ఉన్న ధ్వజస్తంభం దాదాపు 70 సంవత్సరాల క్రితం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిష్టించారని, బాలాలయంలో భాగంగా నూతన ధ్వజస్తంభ స్థాపన చేశామన్నారు.
ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వరకు హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్ 12వ తేదీ మహాసంప్రోక్షణ నిర్వహించినట్లు వివరించారు. ఉదయం 8.00 గంటల నుండి భక్తులకు శ్రీగోవిందరాజస్వామివారి మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు.
అనంతరం టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారి మూలమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో, తిరుమల జెఈవోకు ఆలయ అర్చకులు శేషవస్త్రాం బహూకరించారు.
అనంతరం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ భాష్యకార్లువారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
Source