ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడి సాయిబాబా విగ్రహం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వాడ సమీపంలోని 116 అడుగుల షిరిడి సాయి విగ్రహం ఇప్పడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద షిరిడిసాయి విగ్రహంగా చెబుతున్నారు. ఈ మందిరం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ సమీపంలోని రేపూరు గ్రామంలో ఉంది. కాకినాడ నుండి ఇంద్రపాలెం మీదుగా గొల్లలమామిడాడ వెళ్లే రూట్ లో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఆ విగ్రహం ఉంది. అక్కడ ఒక షిరిడిసాయి మందిరం ఉంది.దానికి అనుబంధంగా ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు.

కాలుపై కాలు వేసుకుని నిర్మలంగా కూర్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు కనిపించే ఈ భారీ సాయి విగ్రహం చుట్టుప్రక్కల 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపిస్తుంది.

సాయి సేవాశ్రమ్ వ్యవస్థాపకులు, సాయిభక్తులు శ్రీ అమ్ముల సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరంలో ఈ విగ్రహ నిర్మాణం ప్రారంభించగా 12 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగింది. 2012 డిసెంబరులో విగ్రహాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి టన్నులకు పైగా బరువు ఉన్న ఈ విగ్రహాన్ని నాలుగు అంతస్తుల భజన మందిరం నిర్మించి దానిపై సాయి కూర్చున్నట్టుగా నిర్మించారు. సుమారు రూ. 4 కోట్ల రూపాయల వరకూ ఖర్చయిందని తెలుస్తోంది.

ఈ విగ్రహాన్ని అక్కడి సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు వివిధ జిల్లాల భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో ఉదయం 5.15 గంటలకు కాకడ హారతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6.00 గంటలకు సంధ్యాహారతి,  రాత్రి 8.00 గంటలకు శయన హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గురువారం ఉదయం 8.30 గంటలకు సాయి పల్లకి సేవ ఉంటుంది.  ఈ మందిరానికి చేరుకోవాలంటే ముందుగా కాకినాడ చేరుకోవాలి, అక్కడి నుండి విరివిగా ఆటోలు దొరుకుతాయి. స్వంతవాహనాలపై వచ్చేవారు సులభంగా మందిరం చేరుకోవచ్చు.