ఈ సంర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 7 నుండి 12వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదివరకు ఉన్న ధ్వజస్తంభం దాదాపు 70 సంవత్సరాల క్రితం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రతిష్టించారని, బాలాలయంలో భాగంగా నూతన ధ్వజస్తంభ స్థాపన చేశామన్నారు.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాసంప్రోక్షణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, గతంలో 2004వ సంవత్సరం మే నెలలో ఈ కార్యక్రమం టిటిడి ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
కాగా గత సంవత్సరం డిసెంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి గర్భాలయం మరమ్మత్తులు చేపట్టేందుకు ” బాలాలయం” నిర్వహించామని, ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం ద్వారా బాలాలయంలో ఉన్న శక్తిని తిరిగి స్వామివారి మూలమూర్తికి పున: ప్రతిష్ట చేస్తామన్నారు.
ఆలయంలోని యాగశాలలో ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వరకు హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించి, ఏప్రిల్ 12వ తేదీ గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు యాగశాల యందు మహాపూర్ణాహుతి, ఉదయం 4.30 నుండి 6.30 గంటల వరకు మీన లగ్నంలో ప్రధాన కలశంతో గర్భాలయం చేరి స్వామివారికి ప్రాణప్రతిష్ట జరుపనున్నాట్లు తెలిపారు.
ఇందుకోసం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 30 మంది ప్రముఖ రుత్వికులను ఆహ్వానించామన్నారు. ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
అంతకుముందు ఉదయం జరిగిన రుత్విక్‌వరణంలో కార్యక్రమంలో టిటిడి ఈవో దంపతులు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ దంపతులు పాల్గొని రుత్వికులకు వస్త్రాప్రదానం చేశారు.
నూతన ధ్వజస్థాంభ స్థాపన
శనివారం ఉదయం 11.00 గంటలకు నూతన ధ్వజస్థాంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో విష్వక్సేనారాధాన, పుణ్యాహవచనం, రత్నాన్యాసం, ధ్వజరాధనం, రత్న స్థాపనం, ధ్వజస్థాపనం నిర్వహించారు.
ఘనంగా అంకురార్పణ
శనివారం రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రుత్వికులకు రక్షాబంధనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ఉదయ్ భాస్కర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణభట్టార్ శ్రీ ఎ.పి.శ్రీనివాసమూర్తి దీక్షితులు, శ్రీవారి ఆలయం ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజస్వామి, సూపరెంటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, ఎవిఎస్వో శ్రీ పార్థసారధిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Source