
నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే భారతీయ సంస్కృతిలో వివిధ మాసాల్లో నవరాత్రులను జరిపే సంప్రదాయం ఉంది. వాటిని చైత్ర, ఆషాఢ, మాఘ మాసాల్లో నిర్వహిస్తారు.
చైత్రే శ్వినే తథాషాడే మాఘే కార్యోమహోత్సవః
చతుర్షు నవరాత్రేషు విశేషాత్ఫలదాయకః
అని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. గొప్ప ఫలితాలను కోరుకొనే వారు ఈ నాలుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించాలని సూచిస్తోంది.
వసంతకాల ప్రారంభమైన చైత్ర మాసంలో మొదటి తొమ్మిది రోజులూ నిర్వహించే నవరాత్రులను ‘వసంత నవరాత్రులు’ అంటారు. దేవీ పూజలను ఈ రోజుల్లో విశేషంగా చేస్తారు. అలాగే పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీరామ నవరాత్రులను జరిపి, తొమ్మిదో రోజైన శ్రీరామ నవమి నాడు సీతారామ కల్యాణం నిర్వహిస్తారు.
వసంత నవరాత్రుల ప్రత్యేకత
చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులు... రామ నవరాత్రులు నిర్వహిస్తారు. వసంత రుతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి వీటిని వసంత నవరాత్రులు అని పిలుస్తారు. శరదృతువులో ఆశ్వీయుజ మసంలో వచ్చే శరన్నవరాత్రులకు (దేవీ నవరాత్రులకు) ఎంతటి ప్రాశస్త్యం ఉందో.. వసంత నవరాత్రులకూ అంతే ఆధ్యాత్మిక విశేషం ఉంది. వైష్ణవ క్షేత్రాలన్నీ వసంత నవరాత్రుల సంబరంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. రాముడు జన్మించిన తిథి చైత్ర శుద్ధ నవమి. రాముని జన్మోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం జరుపుకుంటాం. పాడ్యమి మొదలు రామకల్యాణం జరిగే నవమి వరకూ నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. నవరాత్రుల్లో రమణీయమైన ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ.. కమనీయమైన రామకథను పారాయణం చేస్తుంటారు. రామాయణం ప్రకారం.. రాముడు–ఆంజనేయుడు తొలిసారి కలుసుకుంది వసంత ఋతువులో. సుగ్రీవునితో రాముడి మైత్రి చిగురించిందీ ఈ ఋతువులోనే. రావణుడు.. సీతమ్మను అపహరించింది కూడా ఈ వసంతంలోనే. వసంత ఋతువులో శుభం జరిగినా, అశుభం ఎదురైనా.. అంతిమ ఫలితం శుభప్రదంగా ఉంటుందని పెద్దల మాట. నవరాత్రుల్లో రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. రామాలయాల్లో భక్తుల భజనలు, సంకీర్తనలతో.. రామనామం మార్మోగుతుంటుంది.
ఉగాది మొదలు శ్రీరామ నవమి వరకూ తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు గా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల ప్రాధాన్యత ఏమిటి, ఏఏ దేవతలను పూజించాలి ఈ వీడియోలో తెలుసుకోండి.