''చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పధమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'''
అనగా బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం(ప్రభవ)లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం(చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. ఇలా సృష్టి క్రమానుసారంగా ఏర్పడ్డ సంవత్సరాలు మొత్తం అరవై. ప్రభవ నామ సంవత్సరం మొదటిది. అక్షయ నామ సంవత్సరం చివరిది. ఈ మొత్తం 60 సంవత్సరాలలో మనిషి తన జీవిత కాలం మొత్తం మీద రెండు కన్నాఎక్కువ సార్లు ఒకే సంవత్సరాన్ని చూడలేడు. అందుకే తను జన్మించిన సంవత్సరం మళ్ళీ చూసిన నాడు అంటే తన అరవయ్యో ఏట (60 పుట్టినరోజు) తనకి అంత ఆయుష్షు ఇచ్చినందుకు గాను ''షష్టిపూర్తి మహోత్సవం'' జరుపుకుంటారు.
''ఉగాది' కాలాన్ని ఆరాధించే పండుగ
''కాలః కాలయతా మహం'' అన్నాడు శ్రీకృష్ణుడు. కంటికి కనిపించని ఆ కాలం యొక్క స్వరూపం నేనే అంటాడు గీతాచార్యుడు. అందుకే ''ఉగాది'' రోజున విష్ణు సంకీర్తనం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభప్రదం అని పెద్దలు చెబుతారు. ''యుగం'' అంటే జంట అనే అర్థం కూడా ఉంది. ఉత్తరాయణం, దక్షిణాయణం అనే జంట ఆయనాలతో కూడిన యుగ ప్రారంభానికి యిది తొలి రోజు కనుక దీనిని ''ఉగాది'' అన్నారు. సృష్టి' ఆరంభంలో తొలి సూర్యోదయం చైత్రశుద్ధ పాడ్యమి నాడు(ఉగాది) లంకానగరంలో జరిగిందని, భాస్కరాచార్యుడు ''సిద్ధాంత శిరోమణి''లో ప్రస్తావించాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడు కాబట్టి కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది.
వేదాలను సోమకుడనే రాక్షసుడు అపహరిస్తాడు. మత్స్యావతారధారియైన శ్రీమహావిష్ణువు సోమకుడిని వధించి వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. చైత్ర
శుక్ల పాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది.
ఉగాది నిర్వచనం
''ఉగాది'', మరియు ''యుగాది'' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ''ఉగ'' అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. అంటే సృష్టి ఆరంభమైన దినమే ''ఉగాది''. 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే అయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

ఉగాది పండుగ ఇలా జరుపుకోవాలి
ఉగాది మనకు సంవత్సరాది. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తానలేచి, అభ్యంగన స్నానం చేయడం అతిముఖ్యమైన విధి. ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రుల్లో దేవిని ఆరాధిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత నూతన వస్త్రధారణ, భగవత్పూజ పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి భక్షణం మంచిది. ఉగాది రోజున తెల్లవారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు పూజ చేయడం మంచిది. ప్రొద్దునే ఇంటి ఆడవారు తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు.
ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. ఉగాది పచ్చడి తినడాన్ని మనశాస్త్రాలలో ''నింబ కుసుమ భక్షణం'' మరియు ''అశోకకళికా ప్రాశనం '' అని వ్యవహరించే వారు. ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవారు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

త్వామష' శోక నరాభీష్ట మధుమాస సముదర్భవ|
నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు||
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.ఉగాది పచ్చడి వెనుక ఇంకా ఎంతో అర్ధం దాగి ఉంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఖాలు, ఆశ్చర్యానందాలకి ప్రతి రూపంగా షడ్రుచులు (ఆరు రుచులు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు) సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం మన జీవితంలో ని ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక.
తీపి: ఆనందానికి సంకేతం
పులుపు: నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
ఉప్పు: జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతం
కారం: సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
వగరు: కొత్త సవాళ్లు
చేదు: బాధకలిగించే అనుభవాలు
పంచాంగ శ్రవణం
ఉగాది పర్వదినం రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుంటారు. సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. వారివారి జీవితాల్లో రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలిగేందుకు, పంచాంగ శ్రవణం చేయడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ''పంచాంగం'' అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగములు అని అర్ధం. మొత్తం 15 తిధులు, ఏడు వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణముల గురించి మనకు తెలిపేదే ''పంచాంగం''.
పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభి ముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ యే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
రాజు: చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
మంత్రి: సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
సేనాధిపతి: సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
సస్యాధిపతి: సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
సాంగోపాంగం వత్సరస్య బ్రాహ్మణో జన్మతఃఫలం !
అన్నారు పెద్దలు. సాంగోపాంగంగా ఈ వత్సరముయొక్క ఫలాన్ని వినాలి లేదా చదివైనా తెలుసుకోగలగాలి. ముఖ్యంగా పంచాగాన్ని పూజించడం, శ్రవణం చేయడం ముఖ్యవిధిగా చెప్పబడుతున్నది. పంచాంగ శ్రవణంలో చెప్పబడే సంవత్సర దేవత, తిథి దేవత, మాస దేవత, దిన దేవతలు - వీళ్ళందరూ కూడా శ్రవణం చేసేవారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకే కాలపురుషుడు బహురూపములతో భాసిస్తూ ఉన్నాడు. వాటిని ఈ సమయంలో శ్రవణం చేసి ఆయా దేవతల అనుగ్రహం పొందడమనే విధానమే పంచాంగశ్రవణం.
కవి సమ్మేళనం
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ''కవి సమ్మేళనం'' నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఒరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్ని విషయాలను గూర్చి ప్రస్తావిస్తారు కవులు తమ కవితలలో. ఈవిధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
తెలుగు లోగిళ్లలో ఉగాది పండుగ ఇలా...
ఉగాదికి ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి. ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కథ.
ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి, రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు. శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటారు. ఉగాది రోజున శ్రీమహావిష్ణువును, శ్రీమహా లక్ష్మిని ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ రోజున కొత్త పనులు,వ్యాపారాలు మొదలు పెడితే శుభకరంగా కొనసాగుతాయి. ఇళ్ళల్లో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు చేయడం ఈ పండుగ విశేషం. ఉగాది పండుగ రోజున తైలాభ్యంగనం అంటే నువ్వుల నూని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. నూతన సంవత్సరాది స్తోత్రం పఠించాలి, నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి విధిగా సేవించాలి. ఇంకా ధ్వజారోహణం అంటే పూర్ణకుంభ దానం, పంచాంగ శ్రవణం వంటివి విధిగా ఆచరించాల్సినవి. ఇవే విషయాలను ఈ క్రింది శ్లోకం కూడా మనకు విశదపరుస్తోంది.
వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘతైర్యుతమ్!
భక్షితం పూర్వయామేస్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకమ్!!
ఇదే యుగయుగాలనుంచి ఉగాదిరోజున చేస్తున్న ఒక సత్సాంప్రదాయం. దీని భావమేంటంటే...వర్షాదౌ: సంవత్సర ప్రారంభంలో, నింబసుమం: వేపపూత, శర్కరామ్ల ఘృతైర్యుతమ్: బెల్లం/పటికబెల్లం(బెల్లం మరీ శ్రేష్టం),ఆమ్ల: మామిడి, ఘతం: ఆవునెయ్యి ఇవన్నీ కలిపి ఉదయం తొమ్మిది గంటలలోపు భక్షించాలి.