ఉత్సవాలు జరిగే తేదీల వివరాలు ఇవీ...
మొదటిరోజు....
ఉత్సవాల్లో తొలిరోజు ప్రధానఘట్టం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గ్రామంలోని రాజవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు సుదూర ప్రాంతాలనుంచి తరలివస్తారు. భారీరథంలో ఊరేగుతున్న స్వామివారిని చేతులుజోడించి వేడుకుంటూ అరటిపళ్ళు సమర్పించడం ఇక్కడి ఆచారం. భారీ బందోబస్తు మధ్య రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. వేదపండితుల సమక్షంలో వైఖానస ఆగమ సాంప్రదాయాలను అనుసరించి అంగరంగవైభవంగా జరిగే స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా గాంచి తరిస్తారు.
రెండవరోజు....
కళ్యాణోత్సవాల్లో రెండవరోజు అంటే ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటలకు గరుడవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది.
మూడవరోజు...
మూడోరోజు అంటే 28వ తేదీ రాత్రి 7.30 గంటలకు స్వామివారి ఆలయముఖమండపంలో వేదపండితుల సమక్షంలో సదస్యం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ఆంజనేయవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
నాలుగోరోజు....
మార్చి ఒకటిన రాత్రి 8.30 గంటలకు రంగరాజస్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు గజవాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరుగుతాయి.
ఐదోరోజు....
మార్చి 2వ తేదీ ఉదయం 9 గంటలకు దేవుని కోరేరు వద్ద చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు ధ్వజ అవరోహణం, 6.30 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 9 గంటలకు శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ఆలయానికి మార్గం
కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఉంటాయి. రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీ ప్రాంతాలైన గోకవరం, రంపచోడవరం తదితర ప్రాంతాలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో కోరుకొండ చేరుకోవచ్చు.
రాజమహేంద్రవరం నుంచి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 20 కిలోమీటర్ల దూరం, కాకినాడ నుంచి 60 కిలోమీటర్లు , అమలాపురం నుంచి 70 కిలోమీటర్లు.