తిరుమలలో ఘనంగా పురందాస ఆరాధన మహోత్సవాలు

ప్రముఖ వాగ్గేయకారుడు, కన్నడ సంగీత పదకవితా పితామహుడయిన శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాల సందర్భంగా మంగళవారం సాయత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలలో శ్రీవారి ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బెంగుళూరుకు చెందిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థస్వామిజీ, మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రస్వామిజీ వారి అనుగ్రహ భాషణం చేశారు.

అంతకుముందు మంగళవారం ఉదయం 8.00 గంటలకు తిరుమల ఆస్థాన మండపంలో దాససాహిత్యప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లడుతూ ఒక రచన చేయాలంటేనే కొన్ని రోజులు, మాసాలు తీసుకొనే సందర్భంలో, ఒక వ్యక్తితన జీవితకాలంలో నాలుగు లక్షల డబ్భైఐదు వేల  సంకీర్తనలు చేయడమనేది దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసునకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు.

మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. కేవలం ధనార్జనే ప్రధానంగా భావించిన వ్యక్తి తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల ద్వారా జ్ఞానసిద్ధిపొంది ప్రఖ్యాత హరిదాసులుగా ఖ్యాతిచెందారన్నారు. పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలను టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గత పది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతోపాటు తిరుపతి మరియు తిరుమల దివ్యక్షేత్రాలలో నిర్వహించడం విశేషమన్నారు. ఈ మహోత్సవంలో 3000 మందికి పైగా దాసభక్తులు పాల్గొన్నట్టు తెలిపారు.

Source