ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
కాగా, సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు శ్రీవారి ప్రచారరథంలోని స్వామివారికి పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ హరినామసంకీర్తన భక్తులకు మానసిక శాంతిని చేకూరుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి 2,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నట్టు తెలిపారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి భజనలు, కోలాటాలతో శోభాయాత్ర రైల్వేస్టేషన్ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకుందన్నారు. జనవరి 10వ తేదీ బుధవారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటామని తెలిపారు.
శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి చేతులమీదుగా 4 దాస సంకీర్తనల సిడిల ఆవిష్కరణ
శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి తిరుపతి లోని గోవిందరాజ 3వ సత్రంలో 4 దాస సంకీర్తనల సిడిలను బెంగళూరుకు చెందిన శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి ఆవిష్కరించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ లో ఈ సిడిలను రూపొందించారు.
ఇందులో శ్రీమతి దివ్య గిరిధర్ స్వరపరిచి గానం చేసిన “తీర్థ సంకీర్తనెగళు”, శ్రీమతి పరిమళవ్యాసరావు స్వరపరిచి గానం చేసిన “శివ కుటుంబ సంకీర్తనె”, శ్రీ హరీష్ హెగడే స్వరపరచగా శ్రీమతి గీతా సంజీవ్ కులకర్ణి గానం చేసిన “ఇందిరేశ గానామృత”, శ్రీమతి సంధ్యా శ్రీనాథ్ స్వరపరిచి గానం చేసిన “శివకుటుంబ సంకీర్తనె” సిడిలున్నాయి.
ముందుగా బెంగళూరుకు చెందిన శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సువిద్యేంద్ర తీర్థ స్వామి మంగళాశాసనాలు అందించారు. తిరుమల శ్రీనివాసుడు భక్తులకు మోక్షం ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడని చెప్పారు. శేషాచలకొండ తీర్థాద్రిగా, కనకాద్రిగా, వేదాద్రిగా పేరుగాంచిందన్నారు. ఇంతటి విశిష్టమైన కొండను భక్తితో అధిరోహించడం భక్తుల పూర్వజన్మ సుకృతమన్నారు.
Source