సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి


గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్‌ జిల్లాలోని ఈ క్షేత్రము క్రీ.శ.850-928 సంవత్సరాల కాలం కంటే పురాతనమైనదని చరిత్ర చెబుతోంది. కాగా క్రీ.శ. 1422-1436 సంవత్సరముల మధ్యకాలంలో బహుమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంశమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయము పునరుద్ధరింపబడినట్లు క్షేత్ర చరిత్ర ఆధారముగా తెలుస్తోంది.

సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న స్వామివారు

ఈ క్షేత్రములో ప్రధాన దేవత అయిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నందున ఈ క్షేత్రము దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రములో శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడైన శ్రీ నరసింహస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రము కనుక ఈ క్షేత్రము త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలువబడుతున్నది.

ఈ క్షేత్రాన్ని మూడుసార్లు దర్శిస్తే మూడు జన్మల పాపాలూ దూరమవుతాయి


ఈ ఆలయ ప్రాంగణములో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మరాజు వారి ఆలయము కూడా కలదు. అందుకే ‘ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు’ అనే నానుడి ప్రచారంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణములో ప్రధాన దేవాలయంతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వరస్వామి మరియు సంకష్ట వినాయకస్వామి వార్ల ఆలయములు ఉన్నాయి.

ఇలాంటి క్షేత్రము ప్రాచీన పుణ్యక్షేత్రముగా, చారిత్రాత్మకముగా చాలా ప్రసిద్ధి గాంచినది. ఈ ధర్మపురి క్షేత్రము వేదములకు, ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధిగాంచింది. ఈ ధర్మపురి క్షేత్రములో బ్రహ్మ పుష్కరిణితో పాటు అనేక ప్రాచీన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రము నందు సత్యవతి ఆలయము(ఇసుకస్తంభం) నకు చాలా ప్రాశస్త్యము ఉంది. మరియు ఈ క్షేత్రమునందు ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మగుండం, సత్యవతి గుండము, యమగుండం, పాలగుండములు, చక్రగుండం కలవు. మరియు ఈ క్షేత్రములో గోదావరి నది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నందున ఇట్టి క్షేత్రమునకు భక్తులు మూడు పర్యాయములు వచ్చి గోదావరిలో స్నానమాచరించి శ్రీ స్వామి వారిని దర్శించినచో మూడు జన్మలలో చేసిన పాపములు తొలగుతాయని శ్రీ దత్తాత్రేయ పురాణములోఉంది. కావున భక్తులు ఈ క్షేత్రములోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నచో మానసిక, శారీరక ఋణబాధల నుండే కాక ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు ప్రసాదించునని భక్తులకు అపారమైన నమ్మకము.

ఈ దివ్య క్షేత్రములో శ్రీ స్వామివారి బ్రహ్మూెత్సవములు ప్రతి సంవత్సరము పాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి 13 రోజులపాటు అత్యంత వైభవముగా నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము వైశాఖ మాసములో 9 రోజులు శ్రీ నృసింహ జయంతి ఉత్సవముతో పాటు ధనుర్మాసములో ముక్కోటి ఏకాదశి ఉత్సవము అత్యంత వైభవముగా జరుగును. మరియు ప్రతి 12 సంవత్సరములకు ఒకమారు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి.

నిత్య సేవలు


ఉదయం ఐదు గంటలకు ఆలయం తెరుస్తారు. ఏడు గంటలవరకూ సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటల వరకూ అభిషేకం నిర్వహించిన అనంతరం 9.00గంటల నుంచీ 10.00 గంటల వరకూ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆలయంలో ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకూ నిత్యహోమం జరుగుతుంది. ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకూ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12.00 నుంచి 2.00 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తూ మహార్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకూ ఆలయం మూసి ఉంటుంది.

సాయంత్రం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకూ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. అదే సమయంలో మహార్చన కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ నిత్యసేవల్లో భాగంగా పల్లకీసేవ ఉంటుంది. అనంతరం 7.00 గంటల వరకూ మహార్చన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7.00 నుంచి 7.15 గంటల మధ్యకాలంలో మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.00 గంటల వరకూ మహార్చనతోపాటు దర్శన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అనంతరం రాత్రి 8.00 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

హిందూ దేవాలయాలకు వేదిక

ధర్మపురి ప్రముఖ హిందూ దేవాలయాలకు వేదికగా కూడా భాసిల్లుతోంది. ఇక్కడ బ్రహ్మ, యమధర్మరాజు, శివుడు, వెంకటేశ్వరస్వామి నిజరూపాల్లో దర్శనమిస్తారు. ధర్మపురిలో ఇంకా పలు సందర్శనీయ ప్రాంతాలు కూడా ఉన్నాయి. శ్రీయోగ నరసింహస్వామి, శ్రీఉగ్ర నరసింహస్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి, శ్రీ సంతోషిమాత దేవాలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీ గౌతమేశ్వరాలయం, శ్రీ మహాలక్ష్మి ఆలయం, శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వరి ఆలయం తదితరాలు చూడదగిన ప్రముఖ ప్రాంతాలు.

ధర్మపురికి 10 కిలోమీటర్ల దూరంలోని గూడెం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామిదేవాలయం ఒకటి ఉంది. 45 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టు వద్ద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం ధర్మపురికి 70 కిలోమీటర్లదూరంలో ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు చూసి తరించవలసిన ప్రాంతాలే. యాత్రీకులు ధర్మపురి, బాసర రెండు ప్రాంతాలను ఒకేసారి దర్శించుకునేలా ప్రణాళిక వేసుకోవచ్చు. బాసర ధర్మపురికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి బాసర సరస్వతి దర్శనం అనంతరం సాయంత్రం వేళల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి

ధర్మపురి న్యూఢిల్లీ, చెన్నై హైవే మీద ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రోడ్డుమార్గం గుండా చేరుకునేందుకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌, కరీంగనర్‌, జగిత్యాల, వేములవాడ, మంచిర్యాల, నాగపూర్‌, ముంబయి, నాందేడ్‌ తదితర ప్రాంతాల నుంచి ధర్మపురికి రోడ్డుమార్గం గుండా చేరుకోవచ్చు. దగ్గరలో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఉంది.