మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు. భీష్ముడు ఈ రోజున పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ధర్మరాజుకు ఉపదేశించాడు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని వాటిని ఆమోదించాడు. ఇలాంటి మహత్తర ఘట్టం మరెక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం అది.
ఉత్తరాయణ పుణ్యకాలం కోసం
భీష్ముడు సుమారు నెలన్నర నుండి అంపశయ్య అంటే భాణాలతో చేసిన శయ్యపై పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. భీష్ముడు స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయిన కారణం ఉత్తరాయణం వరకు ఉండాలి అని సంకల్పించుకున్నాడు కాబట్టే. ఫుణ్యదినమైన ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని ధృఢ సంకల్పంతో, మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకుంటూ కాలం గడుపుతున్నాడాయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు భీష్మడు. అంతటి జ్ఞానులైన మహనీయులకు ఈ దేహాన్ని వీడి వెళ్లేందుకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదని ఉపనిషత్తు చెబుతుంది. అంతేకాదు అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.
ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. అయితే భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
భీష్మడు అన్ని రోజుల ఎందుకు అంపశయ్యపై ఉండాల్సి వచ్చింది?
ద్రౌపతికి మయసభలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు భీష్ముడు, అదే తాను చేసిన అపరాధంగా భీష్మాచార్యులవారు భావిస్తున్నారు. దాన్నే పేదే పదే తలచుకుంటూ, భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయానని కుంగిపోయాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం ధుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు.
హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు.
నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు అంటూ భీష్మాచార్యల వారిచేతనే ధర్మబోధ చేయించాడు శ్రీకృష్ణపరమాత్మ.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం వల్ల సులభంగా తరించ వీలు ఉంటుందంటారు పెద్దలు.
శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే(వాసము) ఉపవాసం చేస్తారు. భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలకు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.