అరుదైన చంద్రగ్రహణం... సూపర్ బ్లూ బ్లడ్ మూన్...

జనవరి 31న గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో కనిపించనున్నాడు. అందుకే దీన్ని సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. మళ్లీ ఇలాంటి గ్రహణం 2037లో సరిగ్గా జనవరి 31నే ఏర్పడనుండటం విశేషం. జనవరి 31న ఏర్పడే ఈ అరుదైన చంద్రగ్రహణం.. మొత్తం 77 నిమిషాలపాటు కనువిందు చేయనుంది. ఈ సమయంలో చంద్రుడిపై పడే భూమి దక్షిణ భాగపు నీడను స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ అంతరిక్ష వింతను మధ్య ఆసియా, ఇండోనేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఐరోపా, అలాస్కా, కెనడా, సెంట్రల్‌ అమెరికా ప్రాంత ప్రజలు వీక్షించవచ్చు.

సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు పసిఫిక్‌ మహాసముద్రం మీద ప్రయాణిస్తుంటాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ ఏడాది మొత్తం ఐదు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో మూడు పాక్షిక సూర్యగ్రహణాలు కాగా మిగతా రెండు చంద్ర గ్రహణాలు. ఫిబ్రవరి 15, జూలై 13, ఆగష్టు 11 తేదీల్లో ఏర్పడే సూర్య గ్రహణాలను మన దేశం నుంచి వీక్షించలేం. కానీ జనవరి 31 ఏర్పడనున్న అత్యంత అరుదైన చంద్ర గ్రహణాన్ని మాత్రం కోట్లాది మంది భారతీయుల వీక్షించే వీలుంది. జనవరి 31న సాయంత్రం 6.27 నుంచి 6.31 మధ్య ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని పుణేలోని నెహ్రూ ప్లానెటోరియం డైరెక్టర్ అరవింద్ తెలిపారు.

జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం


జనవరి 31 ఏర్పడనున్న, బ్లడ్ మూన్‌గా పిలిచే అత్యంత అరుదైన చంద్ర గ్రహణాన్ని అమెరికా, ఐరోపా, రష్యా, ఆసియా, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అస్ట్రేలియా నుంచి పూర్తిగా చూడొచ్చు. ఇంకా.. ఉత్తర/తూర్పు యూరోప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర/తూర్పు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఉత్తర/పశ్చిమ దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల నుంచి, ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రదేశాల నుంచి వీక్షించవచ్చు.

అంటే గ్రహణం ప్రారంభం నుంచి సమాప్తం అయ్యేంత వరకు చూడొచ్చన్నమాట. మన దేశంలో ప్రత్యేకంగా కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ నుంచి ఈ బ్లడ్ మూన్‌ను తిలకించవచ్చు. అలాగే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల ప్రజలు కూడా చూడొచ్చు.

  • చంద్రుడిపై భూమి నీడ ప్రారంభం 31 జనవరి 16:21:13 కనబడదు

  • పాక్షిక గ్రహణం ప్రారంభం 31 జనవరి 17:18:27 కనబడదు

  • పూర్తి గ్రహణం ప్రారంభం 31 జనవరి 18:21:47 కనిపిస్తుంది

  • గరిష్ట గ్రహణం 31 జనవరి 18:59:51 కనిపిస్తుంది

  • గ్రహణం పూర్తి 31 జనవరి 19:37:51 కనిపిస్తుంది

  • పాక్షిక గ్రహణం పూర్తి 31 జనవరి 20:41:11 కనిపిస్తుంది

  • చంద్రుడిపై భూమి నీడ పూర్తి 31 జనవరి 21:38:29 కనిపిస్తుంది