రథసప్తమి పర్వదినాన్ని జరుపుకోండిలా...

మనప్రత్యక్ష దేవదేవుడు సూర్యభగవానుని జన్మదినాన్నే మనం రధసప్తమి పర్వదినంగా జరుపుకుంటాం. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసుల జీవనానికి మూలాధారం సూర్యభగవానుడే. పచ్చదనము, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి వస్తున్నదే. సూర్యుని పేరు సప్తిమ. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి అనే ఏడు గుర్రాలలు కలిగిన రధము వాహనముగా కలిగినవాడు. సప్తలోకములకు శక్తిని ప్రసాదించువాడు. సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాశంలో గ్రహ నక్షత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.

అనంతశక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు కలిగిన సూర్యభగవానుని అనేక పేర్లతో పిలుస్తాం, శుద్ధమైన వాడు, భక్తులకు అభయము ఇచ్చేవాడు, జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే వాడు సూర్యభగవానుడు. చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు, మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి ప్రత్యేక నమస్కారాలతో ప్రార్ధించాలి. సుర్యుడు ఆరోగ్య ప్రదాత. ఈ విషయం శాస్త్రీయంగా కూడా రుజువైంది. సూర్య కిరణాలలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు బలాన్ని కలుగజేస్తాయి, కేన్సర్ వంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడతాయి. ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.

రధసప్తమినాడు ఏమి చేయాలి


రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి ,ఆవుపిడకల పై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. సూర్యోదయం కాక ముందే నిద్ర లేచి స్నాన, జప, దానాదులన్ని చేస్తే అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను తలపై ధరించి నదీస్నానము చేస్తే ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధించినట్టు పెద్దలు చెబుతున్నారు. ఆమ్లగుణం గల రేగుపండూ, జిల్లేడు ఆకూ శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది. మేదని చల్లబరుస్తుంది. అందుకే ఆరోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనయినా విధిగా అలా స్నానం చేస్తారు. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.

పురాణ పురుషుల విజయాల వెనుక సూర్యభగవానుడు


‘రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక కీలక మలుపు చోటుచేసుకుంటుంది. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు. రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు. శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.

ఆదిత్య హృదయం


ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు సూర్యనారామణుని వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.

నమస్కారిచిన మాత్రం చేతనే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు భాస్కరునికి కేవలం క్షీరాన్నం నైవేద్యంగా సమర్పిస్తే చాలు.

ఆరోగ్యం ఆదిత్యుని ఆధీనం


'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌' అనగా ఆరోగ్యం సూర్యుని ఆధీనమని, సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అని నిర్వచనం. సామవేదం సూర్య భగవానుడు ఆరోగ్యం, తేజస్సు, బలం ఇస్తాడని పేర్కొంటుంది. సూర్యారాధన వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణయజుర్వేదం కూడా చెబుతోంది. ఫిబ్రవరి మూడున రధసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఆ పర్వదిన విశేషాలేంటో తెలుసుకుందాం.

ఉదయం బ్రహ్మ స్వరూపః
మధ్యాహ్నంతు మహేశ్వరః
సాయంకాలే స్వయం విష్ణుః
త్రిమూర్తిస్తు దివాకరః


అనగా సూర్యభగవానుడు ఉదయ సమయంలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్న సమయంలో మహేశ్వరునిగాను, సాయం సమయంలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. రథసప్తమి రోజున సూర్యుని యొక్క జన్మదినంగా వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ రోజు ప్రాతః కాలమందే మేల్కొని ప్రతి ఒక్కరు విధిగా శిర స్నానం చేయాలి. తల స్నానం చేసే సమయంలో శిరస్సుపైన, రెండు భుజాలపైన జిల్లేడు పత్రాలను ఉంచుకొని ఈ కింది శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి.

సప్తసప్త మహాసప్త
సప్త ద్వీపా వసుంధరా |
సప్తార్క పరమాధార
సప్తమీ రథసప్తమీ ||


రథసప్తమి పర్వదినాన్ని జరుపుకోండిలా...

సూర్యనమస్కారాల ప్రాముఖ్యత


సూర్య నమస్కారాల గురించి వేదపురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. సూర్యనమస్కారాలను బ్రహ్మ ముహుర్తంలో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి.

1.ఓం మిత్రాయనమః 2.ఓం రవయేనమః 3.ఓం సూర్యాయనమః 4.ఓం భానవేనమః 5. ఓం ఖగాయనమః 6. ఓం పూష్ణేనమః 7. ఓం హిరణ్య గర్భాయనమః 8.ఓం మరీచయేనమః 9.ఓం ఆదిత్యాయనమః 10.ఓం సవిత్రేనమః 11.ఓం అర్కాయనమః 12. ఓం భాస్కరాయనమః

ఈ మంత్రాలతో 12 భంగిమల్లో సూర్యనమస్కారాలు చేయాలి. దీనివల్ల శరీరం లోని 638 కండరాలు కదిలి శక్తిరావడం జరుగుతుంది.

లోకంలో సూర్యుని ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ ఉంది. శ్రీకష్ణుని కుమారుడైన సాంబునికి కొన్ని కారణాల వల్ల కష్టువ్యాధి వస్తే అప్పుడు సూర్యునికి సంబంధించిన 12 శ్లోకాలతో సూర్యుని ఆరాధించడం జరిగింది. దీనివల్ల అతని వ్యాధి నయం అయింది. శ్రీరామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని యోచిస్తుండగా అగస్త్యుడు వచ్చి భయాలు శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం విజయం శుభం కలగటానికి ఆదిత్య హదయన్ని భోదించాడు. దానిని పఠించాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడు. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరికి చేర్చుకున్నాడు.

మనలో రాజసిక, తామసిక మరియు సాత్విక ప్రవత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములను అణిచివేయాలి, సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. ఆదిత్యహదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవత్తులను అణిచివేయగలుగుతాం. విజయాన్ని, ఆరోగ్యాన్ని మరియూ ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామచంద్రునికి ఆదిత్యహదయాన్ని చెబితే, దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో మనకు అందించాడు. అది సూర్యుని గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుని ఆవిర్భావ దినం అయిన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్యహదయాన్ని పారాయణ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

సూర్యారాధన మహత్మ్యం


అంతేకాకుండా సూర్యభగవానుని ద్వాపరయుగంలోని సత్రాజిత్తు అనే రాజు పూజించి శమంతకమణిని వరంగా పొందటం జరిగింది. అనారోగ్యంతో ఉన్న వారి పేరు మీద అరుణపారాయణం చేసినా, అరుణహోమం చేయించు కొన్నా మంచి ఫలితం లభిస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న అరసవెల్లి సూర్య నారాయణ స్వామిని దర్శించినా ఇంకా కర్నూలు జిల్లా నంధ్యాల ప్రాంతానికి దగ్గర ఉన్న నవనందులలో ఒక నంది అయిన సూర్యనందీశ్వరస్వామిని రథసప్తమి రోజున దర్శించినా వారు ఆరోగ్యవంతులై, ఐశ్వర్యవంతులవుతారు.

రథసప్తమి రోజు నుంచి సూర్యభగవానుడు తన దిశానిర్దేశమును మార్చుకుంటాడు. హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. అలాగే ఉత్సాహానికి, స్ఫూర్తికి, ఉల్లాసానికి, ఆనందానికి, కష్టానికి, కషికి, సమయపాలన వీటి అన్నింటిలో సూర్యభగవానుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా సూర్యుడు మన పాలిట కొంగుబంగారమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్యప్రదాత, విద్యా ప్రదాత. మనందరికి ఆదర్శ మూర్తి అయిన సూర్యభగవానుని జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకుందాం.