అరుదైన ఆలయం కటార్మల్ సూర్యదేవాలయం

దేశంలో అతి అరుదుగా కనిపించే సూర్యదేవాలయాల్లో కోణార్క్ సూర్యదేవాలయం చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుసు. కానీ ఉత్తరాఖండ్ ఆల్మోరా జిల్లాలో ఉన్న కటార్ మల్ సూర్యదేవాలయానికి కూడా ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యతలున్నాయి.

ఈ ఆలయం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతున్న నైనిటాల్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలోనే ఒక అరుదైన సూర్యదేవాలయం తొమ్మిదవ శతాబ్దములో అప్పటి కత్యౌరీ రాజుల్లోని కటార్ మల్లు రాజుఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు చారిత్రక శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ఆలయం చుట్టూ శిల్పకళాచాతుర్యం ఉట్టిపడే విధంగా నిర్మించిన రాతి కట్టడాలతో 44 ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వివిధ దేవతామూర్తులతో విరాజిల్లుతున్నాయి.

ఇక్కడ సూర్యభగవానుడు బ్రుధాదిత్యుడు లేదా వరదాదిత్యునిగా పిలువబడుతూ భక్తులనుంచి పూజలందుకుంటున్నాడు. మిగిలిన ఆలయాల్లో శివపార్వతులు, లక్ష్మీ నారాయణులు ప్రముఖంగా మనకు కనిపిస్తారు. అయితే ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న సూర్యభగవానుని విగ్రహం 10వ శతాబ్దంలో శత్రువుల దాడుల్లో ధ్వంశమైందని చెబుతారు. ఈ దాడుల్లో దేవాలయం కూడా పాక్షికంగా ధ్వంశమైంది. అప్పుడు ఈ ఆలయానికి సింహద్వారంగా నిర్మించబడిన ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దబడిన చెక్క తలుపులను ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు తరలించి భద్రపరిచారు.

తరువాత ఈ ఆలయాన్ని చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఉన్న వివిధ ప్రముఖ యాత్రాస్థలాలను దర్శించడానికి వెళ్ళినపుడు మీరు చూడాల్సిన వాటిలో కటార్ మల్ సూర్య దేవాలయం కూడా ఉందని గుర్తుంచుకోండి.
ఈ ఆలయాన్ని సందర్శించడానికి వేసవికాలం అనువైన సమయం. అయితే నవంబరు నుంచి మార్చి వరకూ వివిధ రకాల యాత్రా కంపెనీలు ప్యాకేజీ టూర్లను ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. మిగిలిన సమయాల్లో అతి శీతలంగా ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా ఉంటుంది.

ముందుగా ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా సిటీకి చేరుకుంటే అక్కడినుంచి బస్సులో గంటపాటు ప్రయాణిస్తే కటార్ మల్ దేవాలయానికి చేరుకుంటారు. రైలు ప్రయాణం చేసేవారు ఆల్మోరా నగరానికి గంట ప్రయాణం దూరంలో ఉన్న కెజిఎం(కాఠ్ గోదామ్) రైల్వేస్టేషన్లో దిగి అక్కడినుంచి ఆల్మోరా చేరుకోవాల్సి ఉంటుంది.