తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు నెలల్లో పూర్తిస్థాయిలో కదిలే పైకప్పును ఏర్పాటు చేస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
బుధవారం నాడు జెఈవో ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ శ్రీచాముండేశ్వరినాథ్ రూ.50,14,000/- విరాళం అందించారని, ఈ మొత్తంతో ఆలయంలో తిరుమలరాయ మండపం తరువాత కల్యాణమండపానికి వెళ్లే మార్గంలో కదిలే పైకప్పును ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా, మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ రామేశ్వరరావు రూ.1,01,00,000/- విరాళం ఇచ్చారని, ఇందులో రూ.74 లక్షలు వెచ్చించి పడికావలి నుంచి ధ్వజస్తంభం వరకు కదిలే పైకప్పును ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఆలయ ప్రదక్షిణమార్గంలో వకుళామాత పోటు, పరకామణి, సబేరా ప్రాంతాల్లో కదిలే పైకప్పు ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చారని, మొదటి విడతగా కొంత మొత్తం విరాళంగా అందించారని చెప్పారు. అన్నప్రసాద వితరణ వద్ద కదిలే పైకప్పు ఏర్పాటుకు దాతలు ముందుకు వస్తున్నారని వివరించారు. వర్షం పడుతున్నప్పుడు, తీవ్రమైన ఎండ ఉన్న సమయాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా కదిలే పైకప్పును వినియోగిస్తామన్నారు. ఈ పైకప్పు వల్ల భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభాన్ని పూర్తిగా దర్శించుకునే అవకాశం కలుగుతుందని జెఈవో తెలిపారు.
Source