వైకుంఠ ఏకాదశి విశేషాలు-ముక్తికి మార్గం వైకుంఠ ద్వార దర్శనం


“కార్తీకమాసంతో పాటు ధనుర్మాసం కూడా ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసమంతా శివనామస్మరణతో మారుమోగితే, ధనుర్మాసం అంతా శ్రీమహావష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ ఏడాది డిసెంబరు 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది, జనవరి నెల్లో మకర సంక్రమణం వరకూ కొనసాగుతుంది. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో ప్రశస్తమైనది. ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుచుకునే ఈ పర్వదినం గురించిన వివరాలు తెలుసుకుందాం.  “

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని నమ్మకంతో వైష్ణవాలయాలలో ఉత్తరద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భగవద్దర్శనార్థం భక్తులు వేచి ఉంటారు. వైకుంఠ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని పురాణ గాధలు చెబుతున్నాయి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు నిర్వహిస్తారు.

పురాణ గాధలు

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి గురించి పలు పురాణ గాధలు ఇలా చెబుతున్నాయి... విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారికోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడు. ఆ ద్వారంగుండా వెళ్ళి  విష్ణువును దర్శించిన రాక్షసులు తమకథ విని, వైకుంఠ ద్వారం గుండా విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. సాధారణ దినాల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులకు వైకుంఠ ద్వారంగా పిలిచే ఉత్తర ద్వారం గుండా భగవానుని దర్శనానికి అనుమతి ఇస్తారు. తిరుపతిలో కూడాఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవేంకటేశ్వరుని దర్శనం కల్పిస్తారు. లక్షలాది మంది భక్తులు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు తరలి వస్తారు.

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశిగా పేరుగాంచింది. ముర అనే రాక్షసుని దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణువేడగా ఆయన వానితో తలపడి వానిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి రూపం ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.

దీంతో ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.  ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీనిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. సాధారణంగా ఏకాదశినాడు మనం ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు కాబట్టి ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగా పేరు వచ్చింది. దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని కూడా పేర్కొంటారు.

మూడు కోట్ల ఏకాదశులతో సమానం

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ''వైకుంఠ ఏకదశీ వ్రతం'' ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వతుని సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృ దేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. కృత యుగంలో ''ముర'' అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తారని ఏకాదశి వ్రత నిర్వచనంగా పెద్దలు చెబుతారు. వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతమాచరిస్తారు.

వైకుంఠ ఏకాద‌శి విశిష్ఠత

ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశిష్టమైనవిగా పరిగణిస్తాము. అవి ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలి ఏకాదశి/శయనైకాదశి) కార్తీక శుద్ధ ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి) మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి

పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.

కాలంలో ఉత్తరం పగలు, దక్షిణం రాత్రి. కుడి చేయి దక్షిణం, ఎడమ చేయి ఉత్తరం ఎక్కడైనా (ఉత్తర దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది. దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట. అనగా, వారికి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరముఖంగా శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠవాసుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్షైకాదశి అని కూడా అంటారు.

యోగ శాస్త్రాల ప్రకారం యోగాభ్యాసాన్ని చేసే సాధకులందరు శ్రీహరి యోగనిద్రకు ఉపక్రమించిన శయనైకాదశి (ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి)నాడు యోగ సాధనని ప్రారంభించి చిత్తశుద్ధితోనూ, నిష్ఠతోనూ సక్రమంగా చేస్తే, ఈ ఏకాదశి, అంటే పుష్య శుద్ధ ఏకాదశికి వైకుంఠ దర్శనమవుతుందనీ, ఆ కారణంగా ఇది వారి పాలిట వైకుంఠ ఏకాదశి అవుతుందని పెద్దలు చెప్పే అనుభవపూర్వక ప్రవచనం.