జనవరి చివరి నాటికి సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనం పూర్తిస్థాయి కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శనం పూర్తిస్థాయి కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన రూపకల్పనలు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌లతో కలసి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేది నుండి 23వ తేది వరకు 6 రోజుల పాటు తిరుమలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానంపై భక్తులు సంపూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ఐటి అప్లికేషన్‌ను టిసిఎస్‌ ద్వారా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రస్తుతం వాడిన సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని, భక్తులు సులువుగా టోకెన్లు పొందేందుకు వీలుగా తయారు చేయాలని సూచించారు.

అదేవిధంగా మార్చి నెలలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా తిరుమల, తిరుపతిలో ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన రూపకల్పనలు తయారు చేయాలన్నారు. సదరు కౌంటర్ల నిర్వహణకు ఏజెన్సీని ఖరారు చేయాలని, ఏజెన్సీ ఎంపికకు అవసరమైన విది, విధానాలు తయారు చేయాలని అన్నారు.

అంతకుముందు ఆన్‌లైన్‌లో 2018 డైరీలు, క్యాలెండర్లు రిజర్వు చేసుకున్న భక్తులకు తపాలాశాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ప్రజాసంబంధాల అధికారి డా. టి. రవిని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్‌ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Source