సర్వదర్శనం భక్తులకు టైంస్లాట్ విధానాన్ని అమలుచేసేందుకు ఉద్దేశించిన టోకెన్ జారీ కౌంటర్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. సర్వదర్శనం టోకెన్ జారీ కౌంటర్లపై శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్, అన్నదానం, విజిలెన్స్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
తిరుమలలోని 14 ప్రాంతాలలో 117 కౌంటర్లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కౌంటర్లకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన కౌంటర్లు ఏర్పాటుచేశామని, ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేసే రోజులకు మాత్రమే అద్దె చెల్లిస్తామని వెల్లడించారు. ఆధార్‌తో మాత్రమే ఈ కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తామని, ఆధార్ లేని భక్తులు యథావిధిగా సర్వదర్శనం కంపార్ట్‌మెంట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలియజేశారు.