శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో అన్ని రాష్ట్రాల కళా బృందాలకు అవకాశం


కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వాహనసేవలలో దేశంలోని అన్ని రాష్ట్రాల కళాకారులకు అవకాశం కల్పించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ 2018 శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సంప్రదించి, ఆయా రాష్ట్రాలలోని ఉత్తమ కళాబృందాలకు స్వామివారి వాహనసేవలలో అవకాశం కల్పిస్తామని ఆయా ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. శ్రీవారి ఆలయంలో క్యూలైన్లు బాగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి భక్తులు మరింత సంతృప్తి చెందేలా క్యూలైన్లలో మార్పులు తీసుకురావాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. రాబోవు బ్రహ్మూెత్సవాలలో శ్రీవారి ఆలయం, మాడ వీధులు, తిరుమలలోని ఇతర ప్రాంతాలలో విద్యుత్‌ అలంకరణ, లైటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మార్చి నాటికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. టిటిడి ఆస్తులకు సంబంధించిన సమాచారంతో మాస్టర్‌ డేటాను తయారు చేయాలని, డిసెంబరు నెల చివరినాటికి మెదటిదశ, 2018 మార్చి 31వ తేదీ నాటికి డేటా పూర్తి చేయాలని ఆదేశించారు.

తిరుమలలో గదుల నిర్వహణకు సంబంధించి భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలని, అదేవిధంగా ఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా అందిన సమస్యలను త్వరత గతిన పరిష్కరించాలని ఆదేశించారు. గదుల నిర్వహణపై భక్తులకు ముందస్తు సమాచారం అందేలా టిటిడి వెబ్‌సైట్‌లో గదుల బుకింగ్‌ సమయంలోనే ఎఫ్‌ఎమ్‌ఎస్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గదుల నిర్వహణకు సంబంధించి ఎక్కువ ఫిిర్యాదులు అందింన అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని, తద్వారా సమస్యలు సత్వరం పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. టిటిడి సేవలకు సంబంధించిన చెల్లింపుల కోసం నెట్‌ బ్యాకింగ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపేకార్డు, భీమ్‌యాప్‌ను గేట్‌వేగా వినియోగించుకోవాలని అకౌంట్స్‌ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా తిరుచానూరు బ్రహ్మూెత్సవాలలో కళాబృందాలకు టిటిడి మొదటి సారిగా అందించిన సంచార మ్యూజిక్‌ సిస్టం ( పోర్టబుల్‌ యాంప్లిఫైయర్‌ ఆడ్రస్‌ సిస్టం)ను తిరుమలలో రాబోవు శ్రీవారి పౌర్ణమి గరుడసేవకు ప్రయోగాత్మకంగా పరిశీలించాలన్నారు. ఈ మ్యూజిక్‌ సిస్టం ద్వారా వచ్చే సంగీతం గ్యాలరీలోని భక్తులకు ఎంత దూరం వరకు వినపడుతుందనే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. సప్తగిరి మాసపత్రిక చందా దారులందరికి సకాలంలో అందేెలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.