ధార్మిక కార్యక్రమాలలో శ్రీవారి అదనపు లడ్డూ ప్రసాదాలు


కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని టిటిడి సహకారంతో నిర్వహించే పలు ధార్మిక సంస్థల కోరిక మేరకు అదనంగా అందించే లడ్డూ ప్రసాదాలు ఇకపై టిటిడి ప్రతిపాదించిన రుసుంతో పొందాల్సి ఉంటుందని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలో జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు శ్రీనివాస కల్యాణాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు అందించే టిటిడి లడ్డూ, వడలను సాధారణ ధరకే అందిస్తున్నట్లు తెలిపారు. టిటిడి ధార్మిక కార్యక్రమాలకు ఇకపై కూడా రూ.100-ల పెద్ద లడ్డూలు 10, సాధారణ చిన్న లడ్డూలు రూ.25 చొప్పున 200, వడలు రూ.25 చొప్పున 10, చిన్న లడ్డూలు రూ. 3.50ధరతో 1000 అందిస్తామన్నారు.


అయితే టిటిడి సహకారంతో పలు ధార్మిక కార్యక్రమాలు, శ్రీనివాసకల్యాణాలు నిర్వహిస్తున్న సంస్థలు తమ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, ప్రస్తుతం టిటిడి అందిస్తున్న లడ్డూ ప్రసాదాలు సరిపోవడం లేదన్నారు. కావున తమకు సబ్సిడి ధరకు కాకుండా టిటిడి నిర్ణయించిన ధరలకు అదనపు లడ్డూ, వడ ప్రసాదాలను పొందడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెసిన అభ్యర్థన మెరకు టిటిడి ప్రసాదాల ధరలను సవరించిందని ఆయన తెలియజేశారు.

ఇకపై అదనంగా శ్రీవారి ప్రసాదాలు కావలసిన ధార్మిక కార్యక్రమాల నిర్వాకులు సవరించిన ధరలను చెల్లించి పొందవచ్చని వివరించారు. అదనపు లడ్డూల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పెద్ద లడ్డూ ఒకటి రూ. 200, చిన్న వడ ఒకటి రూ.100, సాధారణ చిన్న లడ్డూ ఒకటి రూ. 50 లు, మిని లడ్డూ ఒకటి రూ. రూ.7 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతేగాక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాలలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టంచేశారు.