శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన ;”బాలాలయ మహాసంప్రోక్షణ”



తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ శుక్రవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

అంతకుముందు ఉదయం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో మాట్లాడుతూ ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో మధ్యాహ్నం 1.00 గంటల నుండి భక్తులను శ్రీ గోవిందరాజస్వామివారిని దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనుల కారణంగా మూలమూర్తి దర్శనం ఉండదని, జీర్ణోదరణ తర్వాత మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. 

అంతవరకు భక్తులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు. ఆలయ జీర్ణోదరణలో భాగంగా శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, గరుడాళ్వార్‌, ధ్వజస్తంభం, విమానగోపురం, ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయం, తిరుమలనంబి, భాష్యకార్లు, ఆళ్వారుల ఆలయాలకు మరమ్మత్తులు చేయనున్నట్లు వివరించారు. ఇంతకుముందు 2004లో స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ నిర్వహించినట్లు తెలిపారు.

పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ గోవిందరాజస్వామివారు

ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారు శుక్రవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.