తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. 

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఆలయ ఎఈవో శ్రీ రాధకృష్ణ, ఆలయ ఆర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు

                తేదీ                           ఉదయం                                                         రాత్రి
  • 15-11-2017(బుధవారం)  ధ్వజారోహణం                                        చిన్నశేషవాహనం
  • 16-11-2017(గురువారం) పెద్దశేషవాహనం                                       హంసవాహనం
  • 17-11-2017(శుక్రవారం) ముత్యపుపందిరి వాహనం                          సింహవాహనం
  • 18-11-2017(శనివారం)   కల్పవృక్ష వాహనం                                     హనుమంతవాహనం
  • 19-11-2017(ఆదివారం) పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం                       గజవాహనం
  • 20-11-2017(సోమవారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం,                 గరుడవాహనం
  • 21-11-2017(మంగళవారం) సూర్యప్రభ వాహనం                                 చంద్రప్రభ వాహనం
  • 22-11-2017(బుధవారం) రథోత్సవం                                                   అశ్వ వాహనం
  • 23-11-2017(గురువారం) పల్లకీ ఉత్సవం,                                         పంచమీతీర్థం ధ్వజావరోహణం
Source