తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మూెత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు. తిరుపతి అర్బన్ హాట్ (శిల్పారామం) నుంచి తిరుచానూరు ఆలయ మాడవీధులు, పుష్కరిణి పరిసరాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతితో కలసి బుధవారం ఉదయం జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మూెత్సవాల్లో పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా 22న రథోత్సవం, 23న పంచమితీర్థం సందర్భంగా చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పంచమితీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తిరుచానూరుకు సారె రానున్న సందర్భంగా భక్తులు రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్లు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతిని కోరారు.
ఈ సందర్భంగా ఏనుగులు వచ్చే దారిలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులంతా పుష్కరిణిలో స్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పంచమి తీర్థం రోజంతా శుభఘడియలు ఉంటాయని, ఒక్కసారిగా పుష్కరిణిలోకి ప్రవేశించకుండా ఆ రోజంతా స్నానం ఆచరించవచ్చని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాహనసేవలు తిలకించేందుకు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ తిరుచానూరులో పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపడతామన్నారు. అదనంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు.