తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖకు దాతలు సమర్పించిన 4 టన్నుల కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఇందులో రెండు టన్నులు తమిళనాడు, ఒక టన్ను కర్ణాటక, ఒక టన్ను ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి దాతలు అందించారు.
తొలుత మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ నాలుగు మాడవీధులలో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.
అనంతరం సాయంత్రం 5.00 నుంచి 7.00 గంటల వరకు శ్రీకృష్ణముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో తన్మయత్వం చెందారు.ఈ కార్యక్రమంలో 100 మంది శ్రీవారి సేవకులు, 100 మంది గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో నిత్యకైంకర్యాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని వివరించారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల అధికారులు కృషి చేశారని తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్.పి.శ్రీ అభిషేక్ మహంతి, ఇతర విభాగాధిపతులకు, పోలీస్, తిరుచానూరు పంచాయతి అధికారులకు, టిటిడి సిబ్బందికి, అర్చకులకు అభినందనలు తెలిపారు.