తిరుమలలో అక్టోబర్ 2వ తేది సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవాన్ని టిటిడి వేడుకగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో ఊరేగుతూ అనంతాళ్వారు తోటకు వేంచేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూెత్సవాలు పూర్తయిన మరుసటిరోజు తిరుమలలో ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా భాగ్‌సవారి ఉత్సవాన్ని నిర్వహించారు.
పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారు భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకుమానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలుకోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారులవారు అశ్వత్త వృక్షానికి బందిస్తాడు. స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోనికి ప్రవేశించి మాయమై పోతారు.
అనంతరం అనంతాళ్వారులవారు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది స్వామివారేనని గ్రహించి పశ్చాతాపడ్డాడు. వెంటనే అమ్మవారిని బందీ నుండి విముక్తురాలిని చేసి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.
తన భక్తుడైన అనంతాళ్వారు భక్తికి మెచ్చి స్వామివారు బ్రహ్మూెత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు.