నామ సంకీర్తన ఒక్కటే మోక్ష, జ్ఞాన ప్రదాయిని అని, కాలినడకన తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పొందడమే మెట్లోత్సవం అంతరార్థమని ఉడిపి కాణ్యూర్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విద్యావల్లభ తీర్థస్వామిజీ అనుగ్రహభాషణం చేస్తూ కన్నడ హరిదాసుడైన శ్రీ వ్యాసరాజయతీశ్వరులు తిరునక్షత్రం సందర్భంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేదాలు, ఉపనిషత్తులలో తెలిపినట్లు కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.
పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీమాన్ అన్నమాచార్యులు వంటి వాగ్గేయకారులు, ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టిటిడి మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుడా దాస్య భక్తితో నిష్కామ కర్మగా భగవంతుని ధ్యానించాలని, అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ సనాతన హైందవ ధర్మ ప్రచారానికి కృషి చేస్తుందని ప్రశంసించారు.
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య ప్రసంగిస్తూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3 వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు తెలిపారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
అంతకుముందు ఉదయం 4.00 గంటలకు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు.