శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 27వ తేదీన జరుగనున్న గరుడసేవ రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల రోజువారి సమీక్షలో భాగంగా రాంభగీచా విశ్రాంతిగృహం ఎదురుగా ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌లో మంగళవారం టిటిడి ఉన్నతాధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ గరుడసేవ రోజున భక్తులకు అన్నప్రసాద కౌంటర్లతో పాటు, గ్యాలరీల్లో, భక్తులు రద్దీ ఉండే ప్రాంతాలలో అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేయాలని అన్నప్రసాదం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గరుడసేవ రోజున టిటిడి ఉన్నతాధికారులు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలా భక్తులకు సేవలందించాలనే విషయాలపై జెఈవో పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీ మరింత అధికమయ్యే అవకాశం ఉండటంతో మాడ వీధులు, గ్యాలరీలు తదితర ప్రాంతాలలో టిటిడి భద్రతా అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
భక్తుల ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ కారిడార్లలో భక్తులకు జలప్రసాదాలు అందించాలన్నారు. ఎనిమిది సెక్టార్లలో ఇన్‌ఛార్జీలుగా ఉన్న టిటిడి ఉన్నతాధికారులు ఆయా సెక్టార్లలో మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించి, ఎదైనా సమస్య తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను లోతుగా పరిశీలించాలని శిక్షణలో ఉన్న ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లకు జెఈవో కోరారు.