అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం 5.00 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహంచారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీవారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిచారు. ఉదయం 10.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ ఘట్టాలు నిర్వహించనున్నారు.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.
సెప్టెంబరు 16వ తేదీ శనివారం పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.