”షోడసకళానిధికి షోడసోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి”
అని పదకవితా పితమహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తిరుమల శ్రీవారి వివిధ ఉత్సవ వైభవాలను హృద్యంగా తమ సంకీర్తనలో వివరించారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబరు 1 వరకు జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు 16 దివ్యవాహనాలపైన తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
స్వామివారికి నూతన సర్వభూపాల వాహన సేవ
2013వ సంవత్సరంలో నూతన స్వర్ణరథంపై భక్తులను కనువిందుచేసిన స్వామివారు ఈ ఏడాది బ్రహ్మూెత్సవాలలో శ్రీ మలయప్పస్వామి నూతన సర్వభూపాల వాహనంపై భక్తులను అలరించనున్నారు. కాగా దాదాపు రూ. 8 కోట్లతో 1020 కిలోల బరువు కలిగిన ఈ వాహనంలో 8.89 కిలోల బంగారం 355 కిలోల రాగి (చెక్క బరువు 655 కిలోలు) ఉపయోగించారు. ఇప్పటికే ఈ సర్వభూపాల వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
బ్రహ్మూెత్సవ విశేష కార్యక్రమ మరియు వాహన సేవ వివరాలు
శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మూెత్సవాలకు సంబంధించి ఈ నెల 19వ తారీఖున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 22న అంకురార్పణంతో ప్రారంభం కానున్న బ్రహ్మూెత్సవ వాహన సేవల వివరాలు.
- సెప్టెంబరు 23 ధ్వజారోహణం (మీనలగ్నం సా. 5.48 నుండి సా. 6.00 వరకు) పెద్దశేషవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 24 చిన్న శేషవాహనం- ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు హంసవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 25 సింహవాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు ముత్యపుపందిరి – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 26 కలపవృక్ష వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు సర్వబూపాలవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 27 మోహినీఅవతారం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు గరుడవాహనం – రాత్రి 7.30 నుండి ఉ. 1.00 వరకు
- సెప్టెంబరు 28 హనుమంత వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు రథరంగ డోలోత్సవం – సా. 5.00 నుండి సా. 7.00 వరకు గజవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 29 సూర్యప్రభ వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు చంద్రప్రభ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- సెప్టెంబరు 30 రోథోత్సవం – ఉ. 7.00 లకు అశ్వ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
- అక్టోబరు 1 చక్రస్నానం – ఉ. 6.00 నుండి ఉ. 9.00 వరకు ధ్వజావరోహణం – రాత్రి 9.00 నుండి రాత్రి 10.00 వరకు.
కాగా ఈ వాహనసేవల్లో స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి పెద్దశేషవాహనం, ముత్యపుపల్లకి, కల్పవృక్ష, సర్వభూపాల, స్వర్ణరథ మరియు రథోత్సవాలలో భక్తులను అలరిస్తే చిన్నశేష, హంస, సింహ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ మరియు అశ్వవాహనాలపై వివిధ రూపాలలో శ్రీ మలయప్ప భక్తులను అలరిస్తారు.