శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రతను, టిటిడి ఆస్తులను 24 గంటల పాటు ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాల ద్వారా తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ తెలిపారు. తిరుపతిలోని సివిఎస్‌వో కార్యాలయంలో బుధవారం ఆయన టిటిడి నిఘా, భద్రత అధికారులతో నెలవారీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో నిఘా, భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్, ఇతర టిటిడి సంస్థల్లో అసాంఘికశక్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఎయిర్‌పోర్టుల తరహాలో త్వరలో భద్రతా పరికరాలను ఏర్పాటుచేస్తామన్నారు.
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఆధునిక అగ్నిమాపక పరికరాలను సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. తిరుమలలో ఆక్రమణదారులను, అనధికారిక హాకర్లను, యాచకులను, భక్తులను మోసగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కల్యాణకట్ట, అన్నప్రసాదం కాంప్లెక్స్‌ల్లో సిసి కెమెరాలతో మరింత భద్రతను పెంచుతామని సివిఎస్‌వో తెలిపారు. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తామని, వాహనాలు స్తంభించిన సమయాల్లో వెంటనే తిరుమలలోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేస్తామని చెప్పారు.
సెప్టెంబరు 27న గరుడసేవ రోజు ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.