కలియుగ క్రపత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని అవిష్కరించే విధంగా టిటిడి ఇంజినీరింగ్ విభాగం రూపొందించిన శకటం పంద్రాగస్టు వేడుకలకు విచ్చేసిన వీక్షకులను విశేషంగా అకట్టుకుంది. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శనలో టిటిడి శకటానికి అహూతూల నుండి విశేష స్పందన లభించింది. ఇందులో మండపంలో కొలువై ఉన్న శ్రీవారి ఉత్సవ విగ్రహాలను శ్రీ వేంకటేశ్వరుని నేత్రదర్శనం నేపథ్యంలో ప్రదర్శించారు. ఒకవైపు గరుడ, మరోవైపు ఆంజనేయ స్వామివారు ఉన్నట్లు ఆనంద నిలయం నయనానందకరంగా తీర్చిదిద్దారు.
వేద పారాయణం, మేళతాళాలు వీనులవిందు చేస్తుండగా సాగుతున్న శకటంలో టిటిడి అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో మనగుడి, శిల్పకళాశాల, ప్రాణదానట్రస్టు, బర్డ్ ఆస్పత్రి, అన్నప్రసాదం, గోసంరక్షణశాల, శ్రవణం.. వంటి పలు పథకాలను ప్రతిబింబించేలా నిర్మించారు.
శ్రీనివాస కల్యాణం, అలిపిరి నుంచి వీక్షిస్తే కనబడేలా తిరుమల కొండలు, శంఖు-చక్ర-నామాలు దర్శనమిచ్చేలా శకటం ముందుభాగాన్ని అలంకరించారు. శ్రీవారికి పరమ భక్తులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ, శ్రీవారి చిత్రాలతో కూడిన వెనుకభాగం విశేషంగా ఆకట్టుకుంది. వేదం, నాదం, శబ్దం అనే మూడు అంశాలను టిటిడి శకటంపై ప్రదర్శించారు.
టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో టిటిడి ఇంజినీరింగ్ అధికారులు శకటాన్ని రూపొందించారు.