తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకట్లో భాగంగా గురువారం ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రామాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. సాయత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు పల్లకిలో శ్రీకృష్ణస్వామివారు, బంగారు తిరుచ్చిపై శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మీ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆగస్టు 19న కల్యాణోత్సవం….
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శనివారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతినెలా ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆలయంలో ఉదయం 11.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభమవుతుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.