బాధ్రపద మాసం మనకు రెండు విషయాల్లో కీలకమైన మాసం. 1. వినాయకచవితి పర్వదినం వచ్చేది ఈ మాసంలోనే, 2. పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధుల వంటి కార్యక్రమాలు ఈ మాసంలో చేస్తారు దీనినే మాహాలయ పక్షం అంటాం. అంటే భాద్రపద మాసంలోని శుక్లపక్షం అంటే ఈ మాసంలోని పాడ్యమి తిధి మొదలు పౌర్ణమి వరకూ దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, పౌర్ణమి వెళ్లిన పాఢ్యమి నుంచి అమావాస్య వరకూ ఉండే కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా
గుర్తించాలన్నమాట...
వినాయక చవితి
శుక్లపక్షంలో వచ్చే బాధ్రపద శుద్ధ చవితి మొదలు తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. ఏ పూజ అయినా, పవిత్ర కార్యమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినాన్ని ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ గామనం అత్యంత ఘనంగా జరుపుకుంటాము. వినాయక చవితి పర్వదినం గురించి ఆ రోజు ప్రధానంగా చేసే ఏకవింశతి పత్రపూజ గురించి మీకు వేరే వీడియోలో సవివరంగా వివరిస్తాను.
వరాహ, వామనావతారాలు
ఇంకా ఈ మాసంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దాల్చిన దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని ఈ భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు. అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం.
రాాధాష్టమి
భాద్రపదమాసంలోని శుక్ల అష్టమికి ’రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధా దేవి జన్మించిన రోజు. శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు కూడా. పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించడంవల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు చాలా ఉన్నాయి
హరితాళిక వ్రతం లేదా , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ అంటే ’పదహారు కుడుముల తద్ది జరుపుకుంటారు. ఈ రోజున శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలని పెద్దలు చెబుతారు. ఈ పూజను కన్యలు ఆచరిస్తే వారికి మంచి భర్త లభిస్తాడు అలాగే ముత్తయిదువలు పాటించడంవల్ల వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి.ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం ఉండ్రాళ్ళ తద్ది. తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.భాద్రపద మాసంలో పండుగలు
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ మాసంలోని ఏకాదశినాడు మరొక ప్రక్కకు ఒత్తిగిల్లుతాడంటారు. అంటే పరివర్తన చెందుతాడన్నమాట... అందుకే ఈ రోజును ’పరివర్తన ఏకాదశి’ అని పిలుస్తాం, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు కూడా ఉంది. ఈనాడు అందరూ వారి వారి ఇళ్ళల్లో ఈ ఏకాదశి వ్రతం నిష్టగా చేస్తే సమాజంలో కరువుకాటకాలు రావని, ఒకవేళ వచ్చి వుంటే వాటినుండి తక్షణం విముక్తి లభిస్తుందని పెద్దల ఉవాచ...వామన జయంత
బాధ్రపద మాసంలో శుక్లపక్ష ద్వాదశినాడు దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేస్తే మంచిది.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి
అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.కన్యా సంక్రమణం
ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. బాధ్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.
మహాలయ పక్షం
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.
భాద్రపద మాసంలో విశేషమైన రోజులు ఇవే...
- భాద్రపద శుద్ధ తదియ వరాహ జయంతి
- భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి
- భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి
- భాద్రపద శుద్ధ షష్ఠి సుర్య షష్ఠి
- భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి
- భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతి
- భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం
- భాద్రపద పూర్ణిమ మహాలయ పౌర్ణమి
- భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్షము ప్రారంభం
- భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్దె
- భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
- భాద్రపద బహుళ త్రయోదశి కలియుగము ప్రారంభమైన రోజు.
- భాద్రపద బహుళ చతుర్దశి మాసశివరాత్రి
- భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య