పోలాల అమావాస్య వ్రతం నిష్టగా చేయండి... సంతాన సాఫల్యాన్ని పొందండి


సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే

శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే

ప్రతీ తల్లి తమ పిల్లలు పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం అనేక రకాల నోములు, పూజలు చేస్తుంది. అలాంటి పూజల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణమాసలో వచ్చే అమావాస్య రోజున చేస్తారు. పిల్లలు కావాలని కోరుకునేవారు కూడా ఈ పూజను తప్పనిసరిగా చేయాలి.

వ్రత విధానం


ఈ వతం తెలుగు రాష్ట్రాల్లో అందరూ జరుపుకునే వ్రతం. కాకపోతే ప్రాంతాన్ని బట్టి విధానం కొద్దిగా మారుతుంది. అంతే కాదు వారి వారి వంశాచారం ప్రకారం కూడా వ్రత పద్దతుల్లో స్వల్పంగా మార్పు ఉండవచ్చఉ కానీ వ్రతాచారం మాత్రం ఒక్కటే. నిర్దిష్టంగా ఈ వ్రతం ఆచరించే విధానం గురించి తెలుసుకుందాం...

గౌరీమాతగా కందమొక్కల ప్రతిష్ట


ముందుగా రెండు కందమొక్కలు తీసుకోవాలి... ఒకటి పెద్దది, మరొకటి చిన్నది ఉండాలి. అంటే ఒకటి తల్లి మొక్క మరొకటి పిల్ల మొక్క అన్నమాట. వీటిని మట్టిముద్దతో సహా సేకరించాలి. పూజకు ముందుగా పూజాగదిని శుభ్రపరిచి, పూజా ప్రదేశంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక పీటకు పసుపురాసి, దానిపై వరిపిండితో ముగ్గలు పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించాలి. ఆ ఆపీఠంపై కందమొక్కలను ఒకే చోట ప్రతిష్టించాలి.

పూజాద్రవ్యాలు, తోరాలు


మిగిలిన దేవతల పూజల్లో మాదిరిగానే పూజా ద్రవ్యాలు, వీటితో పాటు ఆవుపాలు, ఆవు పెరుగు కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రధానంగా పూజలో తోరాలు ఉండాలి. ఇందుకోసం తెల్లదారంతో తొమ్మిది పోచలు వేసి, వాటికి పసుపు రాసి, పసుపు కొమ్ముతో కట్టి తోరాలను సిద్ధం చేసుకోవాలి. మొత్తం నాలుగు తోరాలు పూజలో అవరసమవుతాయి. ఈ తోరాలను అమ్మవారి వద్ద పూజలో ఉంచాలి.

తోరాలు నాలుగింటిలో ఒకటి అమ్మవారికి అంటే కంద మొక్కలకు అలంకరించడానికి, రెండవది పూజ చేస్తున్నవారికి, మరోకటి ముత్తయిదువకు ఇచ్చేందుకు నాలుగవది మీ ఇంట్లో ఉన్న ఐదేళ్లలోపు ఉండే ఆఖరు సంతానానికి వినియోగించాలి.

పూజా విధానం


పూజ ప్రారంభించేముందు  కంద మొక్కలను పసుపు, కుంకుమలతో అలంకరించి మనం ముందుగా  తయారుచేసిన పసుపు కొమ్ము తోరాన్ని రెండింటికి కలిపి కట్టాలి.

వ్రతంలో భాగంగా ముందు పసుపు గణపతిని పూజించాలి. ఒక చిన్న రాగి పళ్ళెంలోగానీ, ఇత్తడి పళ్ళెంలో గానీ బియ్యం పోసి దానిపై తమలపాకు ఉంచి దానిలో పసుపు గణపతిని ఆవాహన చేయాలి. గణపతి పూజ చేసి ధూపం, నైవేద్యం, కర్పూర హారతి సమర్పించాలి.

తరువాత మళ్ళీ ఆచమనం చేసి కంద మొక్కలో గౌరీ దేవిని ఆవాహన చేయాలి. తరువాత అర్ఘ్యం, పాద్యం, పంచామృతాలు, వస్త్రాలు, యజ్ఞోపవీతాలు, గంధం, అక్షింతలు, పుష్పాలు సమర్పించి అధాంగపూజ తర్వాత అష్టోత్తర శత నామాలతో సంతాన గౌరీదేవిని పూజించాలి.

నైవేద్యం పూర్తయిన తరువాత కర్పూర హారతి సమర్పించి, అనంతరం చేతిలో అక్షతలు తీసుకుని పోలాల అమావాస్య కథను చదివి అక్షతలు అమ్మవారికి సమర్పించాలి. తరువాత ఆవుపాలు, ఆవు పెరుగులతో ఆ కందగౌరీ దేవిని అలుకుతూ ఈ పాట పాడాలి. ''నీ ఇల్లు ఆవు పాలు, ఆవు పెరుగుతో అలుకుతాను, నా ఇంట సంతానాన్ని వృద్ధి చెందేలా చూడు తల్లీ'' అంటూ మొక్కుకోవాలి.

పూజ పూర్తయిన తరువాత మనం ముందుగా అమ్మవారి వద్ద ఉంచిన తోరాల్లో ఒకటి తీసి పూజ చేసినవారు మెడలో ధరించాలి. మరొక తోరాన్ని ఆఖరిసంతానం మెడలో కట్టాలి.

వాయనదానం


తరువాత పిల్లలు కలిగిన ముత్తయిదువను ఇంటికి పిలిచి పీటపై కూర్చోబెట్టి కాళ్ళకు పసుపురాసి, కుంకుమ, గంధం అలంకరించి, మనం అమ్మవారికి నివేదించిన బూరెలు, గారెలు, పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని వాయినంగా అందించాలి. వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకొంటినమ్మ వాయినం అంటూ వాయినం అందించాలి. ఆ ముత్తెదువకు భోజనం పెట్టి అనంతరం రవికలగుడ్డ, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ, తాంబూలం దక్షిణతో సహా ఆమెకు అందించి ఆశీర్వాదంతీసుకోవాలి.

నైవేద్యంలో ఆచారాలు...


ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పోలాల అమావాస్య నాడు నైవేద్యంగా గారెలు, మగపిల్లలు కలవాళ్ళు బూరెలు నైవేద్యంగా ఆ కంద గౌరీమాతకు  సమర్పించాలి. ఆడపిల్ల, మగపిల్లవాడు కూడా ఉన్నవాళ్ళు గారెలు, బూరెలు కూడా సమర్పించాలి. అయితే కొందరు తమ ఇంటి ఆచారం ప్రకారం పిల్లలికి ఐదు సంవత్సరాలు నిండే వరకూ బూరెలు, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదేళ్ళు నిండిన తరువాత మినప్పిండి, బియ్యపు రవ్వతో చేసిన వాసినపోలు నైవేద్యం చేస్తారు. మరికొందరు తమ పిల్లలకి ఐదేళ్ళు దాటిన నాటినుంచీ పప్పులో ఉండ్రాళ్ళు, పాలలో ఉండ్రాళ్ళు నైవేద్యం చేస్తారు.

తొమ్మిది రకాల కూరలు


అమ్మవారి మహా నైవేద్యం కోసం పులగంతో పాటుగా 9 రకాల కూరగాయల ముక్కలతో వండిన పులుసును నివేదిస్తారు. పులుసులో తమాటా పనికిరాదని పెద్దలు చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు కావాలని వ్రతం చేసేవాళ్లు పిల్లలున్న ఇంటింటికీ వెళ్లి కూరముక్కలు, బియ్యం, పప్పు, సేకరించి అమ్మవారికి నైవేద్యం తమారు చేస్తారు. ఎవరైతే ముందుగా ఇలా మొక్కుకుంటారో వాళ్ళే ఈ విధంగా చేస్తారు. ఇలా...ఎవరి కుంటుంబ ఆనవాయితీని బట్టి వారు నిర్వహిస్తారు. ఏది ఏమైనా వ్రతం ఆచరిండం వెనుక భక్తి భావమే ప్రధానం.

మీరు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి అమ్మవారి ఆశీస్సులకు పాత్రులవ్వండి.