గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన ఆలయాలలో మనగుడి కార్యక్రమంలో భాగంగా గోపూజ, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించినట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ తెలిపారు.
ఈ సందర్భంగా జెఈవో తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని 294 ప్రముఖ పట్టణాలలోని 300 ఆలయాల్లో మనగుడి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయా ఆలయాలలో గోపూజ, ఉట్లోత్సవం వైభవంగా నిర్వహించినట్లు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని 1250 మండలాల్లో ఆగస్టు 12న ఆలయ శోభ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలయాలను శుభ్రం చేసుకుని రంగవల్లులతో అలంకరించుకున్నారని తెలిపారు. ఆగస్టు 13న నగర సంకీర్తన ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
మనగుడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఆయా ప్రాంతాల్లోని జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. భవిషత్తులో మరింత విస్తృతంగా మనగుడి కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆయన వివరించారు.
చిత్తూరు జిల్లాలోని 14 ప్రముఖ పట్టణాలలోని ఆలయాలలో గోపూజ, ఉట్లోత్సవం వైభవంగా జరిగింది. అదేవిధంగా తిరుపతి నగరంలో ముత్యాలరెడ్డిపల్లి శ్రీకృష్ణానగర్‌లోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారి ఆలయంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామకృష్ణారెడ్డి గోపూజ, ఉట్లోత్సవం నిర్వహించి మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆలయంలో స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీవారి కంకణాలు, అక్షింతలు, కలకండను భక్తులకు పంపిణీ చేశారు. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తి సమీపంలోని మేడం గ్రామంలో గోశాలలో డిపిపి కార్యదర్శి పాల్గొని గోపూజ నిర్వహించారు.