అన్నదానం మహాదానం అని పవిత్రమైన వేదాల తెలుస్తోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదని తిరుమల తిరుపతి దేవస్థానం బలంగా విశ్వసిస్తోంది. సనాతనధర్మ పరిరక్షణ, వ్యాప్తితోపాటు అన్నప్రసాద వితరణ తదితర భక్తుల సంక్షేమ కార్యక్రమాలను టిటిడి అమలుచేస్తోంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు తిరుమల, తిరుపతిలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తోంది.
తిరుమలలో అన్నదానానికి శ్రీకారం చుట్టిన వెంగమాంబ
భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాస్తవానికి తిరుమల పుణ్యక్షేత్రంలో 18వ శతాబ్దంలోనే అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ విషయం ఆ కాలం నాటి దానపత్రాల స్పష్టమవుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల తరువాత చెప్పుకోదగిన వారు తరిగొండ వెంగమాంబ. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించి మాతృశ్రీగా ప్రసిద్ధికెక్కారు.
పురాణాల ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ప్రోద్బలంతో అప్పట్లో హథీరాంజీ మఠాధిపతిగా ఉన్న ఆత్మారాం దాస్‌జి శ్రీవారి భక్తురాలైన వెంగమాంబకు తిరుమలలో ఆశ్రయం కల్పించారు. రాంభగీచా తోటల్లోని ఒక పూరింటిని వెంగమాంబకు కేటాయించి, నెలకు సరిపడా బియ్యం, పప్పు, ఇతర వంట దినుసులు పంపేవారు. ఈ పూరిల్లు ఉన్న స్థానంలోనే ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని టిటిడి నిర్మించింది.
ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పట్లో ఉత్తరాన గోల్కోండ నుండి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినపుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు. ఇప్పటికీ 30 నుంచి 40 వరకు దానపత్రాలున్నాయి. ఇవి క్రీ.శ 1785 నుంచి క్రీ.శ 1812 వరకు దాదాపు 30 సంవత్సరాల కాలపరిధిలో వెలువడ్డాయి.
వెంగమాంబ స్ఫూర్తితో అన్నప్రసాద వితరణ
తరిగొండ వెంగమాంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ టిటిడి 1985, ఏప్రిల్ 6న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీ.శే. శ్రీ నందమూరి తారకరామారావు చేతుల మీదుగా శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో రోజుకు 2 వేల మంది తిరుమలలో అన్నప్రసాదాలు స్వీకరించేవారు. ఆ తరువాత 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. ప్రస్తుతం రోజుకు 60 వేల మందికి తగ్గకుండా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
నూతన అన్నప్రసాద భవనం
గడిచిన 30 సంవత్సరాల వ్యవధిలో అన్నప్రసాదంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అందుకు తగ్గట్టు మరింత రుచికరంగా, శుచిగా అన్నప్రసాదాలను తయారుచేస్తున్నారు. 2011వ సంవత్సరంలో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో రూ.33 కోట్లతో అధునాతన అన్నప్రసాదం కాంప్లెక్స్ భవనాన్ని టిటిడి నిర్మించింది.
అన్నప్రసాద భవనంలో రెండు అంతస్తుల్లో నాలుగు భోజనశాలలు ఉన్నాయి. ఒక్కో భోజనశాలలో వెయ్యి మంది చొప్పున మొత్తం నాలుగు వేల మంది భక్తులు ఎక్కడా వేచి ఉండే అవసరం లేకుండా ఒకేసారి భోజనం చేసే అవకాశముంది. ఈ భవనంలో కూరగాయలు నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజి గదులు, వంట సరుకుల నిల్వ కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి.
అన్నప్రసాదం ట్రస్టుకు దాతల విరాళాలు
శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరివిగా విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టుకు వివిధ జాతీయ బ్యాంకుల్లో సుమారు రూ.850 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్టు ఉన్నాయి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని భక్తులకు అన్నప్రసాదాలు అందిచేందుకు వినియోగిస్తున్నారు. ఒక సంవత్సరానికి 2 కోట్ల మందికిపైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఇందుకు గాను ఒక సంవత్సరానికి దాదాపు రూ.80 కోట్లు ఖర్చు అవుతోంది.
ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూలైన్లు, పిఎసి-2, కాలినడక మార్గంలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అదేవిధంగా సిఆర్వో, పిఏసి-1, రాంభగీచా విశ్రాంతి గృహం వద్ద ఇటీవల ఫుడ్‌కోర్టులు కూడా ఏర్పాటుచేశారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజూ, టిటిడి అనుబంధ ఆలయాల్లో బ్రహ్మూెత్సవాల సమయాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, గోవిందరాజస్వామి సత్రాలు, స్విమ్స్, బర్డ్, రుయా ఆసుపత్రుల్లో ప్రతిరోజూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
బయట ప్రాంతాల్లోనూ అన్నప్రసాద వితరణ
టిటిడి పలు ప్రత్యేక సందర్భాల్లో బయటి ప్రాంతాల్లోనూ అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఇప్పటివరకు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాల్లో విశేష సంఖ్యలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసింది. ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్టాండుల్లో అన్నప్రసాదాలను అందిస్తోంది.
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పర్యవేక్షణలో టిటిడి అన్నప్రసాద విభాగాన్ని నిర్వహిస్తోంది. అన్నప్రసాద విభాగం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్, క్యాటరింగ్ అధికారులు శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, శ్రీ టి.దేశయ్య ఆధ్వర్యంలో ప్రతిరోజూ వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్నప్రసాదాలను అందిస్తున్నారు.
కూరగాయల విరాళాలు
తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి రోజుకు 15 టన్నుల బియ్యం, 8 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ల ద్వారా టిటిడి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఎక్కువ శాతం కూరగాయలు దాతల నుండి విరాళంగా అందుతున్నాయి. వంకాయలు, గుమ్మడి, టమోటా, క్యాబేజి, ముల్లంగి తదితర కూరగాయలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందిస్తున్నారు.
అన్నప్రసాద వితరణ సేవలో శ్రీవారి సేవకులు
భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. 2000వ సంవత్సరంలో శ్రీవారి సేవ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో అన్నప్రసాద భవనం, కంపార్ట్మెంట్లు మరియు క్యూలైన్లు, ఉద్యోగుల క్యాంటీన్, యాత్రికుల వసతి సముదాయం -2లో భక్తులకు భోజనం, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.
అన్నప్రసాద భవనం, మాధవ నిలయంలో కూరగాయలు తరగడం చేస్తున్నారు. గత 17 సంవత్సరాల కాలంలో మొత్తం 8 లక్షల మంది శ్రీవారి సేవకులు టిటిడిలోని వివిధ విభాగాల్లో సేవలందించారు. అన్నప్రసాద విభాగంలో మాత్రమే ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది సేవకులు భక్తులకు సేవలందించారు.