తిరుపతిలో వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం



శ్రీవారి భక్తురాలైన వెంగమాంబ తన సాహిత్యం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక శక్తి తరంగాలను వ్యాప్తి చేశారని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి తెలియజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా జనరంజకమైన భాషలో వెంగమాంబ రచనలు చేశారని తెలిపారు. వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. వెంగమాంబ మొత్తం 18 రచనలు చేయగా, ఇందులో శ్రీ వేంకటాచల మహత్యం గ్రంథం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.


అనంతరం ఎస్‌కె వర్సిటీ మాజీ ఉపకులపతి, విశ్రాంతాచార్యులు పి.కుసుమకుమారి ‘తరిగొండ వెంగమాంబ – శ్రీవేంకటాచల మహాత్మ్యం” అనే అంశంపై ఉపన్యసిస్తూ వెంగమాంబ రచనల్లో ప్రక్రియ వైవిద్యం మెండుగా ఉంటుందన్నారు. తిరుమల శేషాచల కొండల్లో అణువణువునూ దర్శిస్తూ శ్రీవేంకటాచల మహాత్మ్యం గ్రంథాన్ని రచించారని తెలిపారు.
తిరుమల క్షేత్ర మహత్యాన్ని తెలిపే ఈ కావ్యంలో ఆరు ఆశ్వాసాలు, 248 పద్యాలు ఉన్నాయన్నారు. ఇందులో శేషాచల పర్వతశ్రేణులు, తీర్థాలు, స్వామివారి చరిత్ర ఇమిడి ఉన్నాయని వివరించారు. ఆ తరువాత వెంకటగిరికి చెందిన డా. వి.బి.సాయికృష్ణ యాచేంద్ర ”తరిగొండ వెంగమాంబ – రుక్మిణీ కల్యాణం” అనే అంశంపై, తిరుపతికి చెందిన శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యులు ఆచార్య కె.మధుజ్యోతి ”తరిగొండ వెంగమాంబ రచనలలో గిరిజన జీవితం” అనే అంశంపై, ఎస్వీ ఓరియంటల్‌ కళాశాల అధ్యాపకురాలు డా. ఐ.భాగ్యరేఖ ”తరిగొండ వెంగమాంబ – సామాజిక దృక్పథం” అనే అంశంపై, శ్రీకాళహస్తికి చెందిన డా. ఎన్‌.చాముండేశ్వరరావు ”తరిగొండ వెంగమాంబ – యోగదర్శనం” అనే అంశంపై ఉపన్యసించారు.

కాగా, సాయంత్రం 6 గంటలకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీజి.మధుసూదనరావు బృందం సంగీత సభ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జి సంచాలకులు శ్రీ ధనంజయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Source