సామాన్యులకు మోక్షసాధన మార్గాల బోధనకే పోతన భాగవతం

సామాన్యులకు మోక్షసాధన మార్గాలను తెలియజేయాలి పోతన భాగవతం గ్రంథంతో భక్తితత్వ ప్రచారం

గ్రంథ రచనలో నిష్ణాతులైన పండితులు తమ రచనలు, బోధనల ద్వారా సామాన్యులకు భక్తి విశిష్టతను వివరించి మోక్షసాధన మార్గాలను తెలియజేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కోరారు. భక్తితత్వ ప్రచారంలో పోతన భాగవతం గ్రంథం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భాగవత సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి ఈవో ప్రసంగిస్తూ హిందూ ధర్మప్రచారం కోసం ఆధ్యాత్మిక గ్రంథాలను పెద్ద ఎత్తున ముద్రిస్తున్నట్టు తెలిపారు. వేదార్థాలను ప్రతిపాదించే వాఙ్మయాన్ని వివిధ భాషల్లో ప్రచురించి ప్రచారం చేయడాన్ని టిటిడి బాధ్యతగా స్వీకరించినట్టు చెప్పారు. పలు భాషల్లో ముద్రిస్తున్న ధార్మిక గ్రంథాల్లో రామాయణ, భారత, భాగవతాలు ప్రధానమైనవని తెలియజేశారు. పోతన భాగవతానికి సరళ వ్యాఖ్యానం అందించేందుకు 33 మంది పండితులు విశేషంగా కృషి చేశారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. భావితరాలైన పిల్లలు భక్తిభావాన్ని సులువుగా అర్థం చేసుకునేలా ఇలాంటి పండితులు రచనలు చేయాలని కోరారు.

టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా. సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ ఆంధ్ర వాఙ్మయంలో విశిష్టమైన భక్తి గ్రంథంగా పోతన భాగవతం నిలిచిపోతుందన్నారు. ఇందులో మనసా, వాచా, కర్మేణ భక్తిని ఎలా ప్రదర్శించాలనే విషయాలను పోతన మహాకవి తెలియజేశారని వివరించారు. టిటిడి సప్తగిరి మాసపత్రిక ప్రధాన సంపాదకులు డా. కోటపాటి రాధారమణ మాట్లాడుతూ భారతం, భాగవతం, రామాయణాలను సంపూర్ణంగా ప్రచురించడం ద్వారా టిటిడి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రతి గ్రంథ ముద్రణలోనూ నిష్ణాతులైన పండితుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు.

టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా. తాళ్లూరి ఆంజనేయులు మాట్లాడుతూ మానవులు అంతిమంగా చేరుకోవాల్సిన గమ్యాన్ని పోతన భాగవతం తెలియజేస్తుందన్నారు. పోతన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని, హిందూ సంస్కృతికి జీవగర్ర అయిన భక్తితత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని తెలియజేశారు. పోతన భాగవతం సరళవ్యాఖ్యానం గ్రంథాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాముని కల్యాణం సందర్భంగా గౌ. రాష్ట్ర గవర్నర్‌ శ్రీఇఎస్‌ఎల్‌.నరసింహన్‌ ఆవిష్కరించినట్టు తెలిపారు. అనంతరం శ్రీ మహాభాగవత ప్రాజెక్టు సమగ్ర నివేదికను ఆయన చదివి వినిపించారు.

ఆ తరువాత ఉదయం జరిగిన సాహితీ సమావేశంలో డా. సముద్రాల లక్ష్మణయ్య ”సమాజంపై భాగవత ప్రభావం” అనే అంశంపై, డా. పి.చెంచుసుబ్బయ్య ”గజేంద్రమోక్షం” అనే అంశంపై ఉపన్యసించారు. మధ్యాహ్నం జరిగిన సమావేశానికి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డా. శలాక రఘునాథశర్మ ”భాగవతం నవవిధ భక్తిమార్గాలు” అనే అంశంపై ప్రసంగించారు. ఆ తరువాత డా.కె.సర్వోత్తమరావు ”జడభరతుని కథ” అనే అంశంపై, డా.మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి ”ప్రహ్లాద చరిత్రం” అనే అంశంపై, డా. ఎ.గోపాలరావు ”భాగవతం – మానవజాతికి సందేశం” అనే అంశంపై, డా.కొంపెల్ల రామసూర్య నారాయణ ”భాగవతం మధురభక్తి” అనే అంశంపై ఉపన్యసించారు.

Source