
తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మూెత్సవాలలోపు సర్వదర్శనం భక్తులకోసం కాంప్లెక్స్‌ను పూర్తి చేయాలని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం సాయంత్రం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి వెళ్లేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. గ్యాలరీలలో మరుగుదొడ్ల సంఖ్యను పెంచాలన్నారు. భక్తులు సులువుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా అవసరమైన ప్రాంతాల్లో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంపార్ట్‌మెంట్లలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు.
శ్రీవారి ఆలయంలో విద్యుత్ వైరింగ్‌ను తనిఖీ చేయాలని, ఆలయం, పరిసర ప్రాంతాలలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లైటింగ్ రూపొందించాలని సూచించారు. పూర్తికాని చోట ఎల్‌ఈడి లైట్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీవారి ఆలయం వరకు భక్తులు సులభంగా గుర్తించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఆయా సంస్థలతో చర్చించాలని సీఈ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. మరింత సౌరవిద్యుత్‌ను పెంచేందుకుగాను తిరుమల, తిరుపతిలో సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.
రాష్ట్రంలో అతిపురాతన ఆలయాల జాబితాను రూపొందించి టిటిడి శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా వాటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఈవో సూచించారు. టిటిడికి నగదు, వస్తు రూపంలో విరాళాలు అందించే దాతలకు సౌకర్యాల కల్పనపై విధివిధానాలను రూపొందించాలన్నారు. తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో గల రోడ్లలో, ప్రముఖ కూడళ్లలో పచ్చదనం పెంచి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. శ్రీవారిమెట్టు నడక మార్గంలో భక్తులకోసం తాగునీటి వసతిని పెంచాలన్నారు.
Source