శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు తిరుమల, తిరుపతిలో మరింత సులువుగా, పారదర్శకంగా గదులు కేటాయించేందుకు టిటిడి పలు చర్యలు చేపట్టింది. గదులు దొరకడం లేదన్న భక్తులు సూచనల మేరకు ఉన్న గదులను మరింత సమర్థవంతంగా వినియోగించి ఎక్కువ మందికి వసతి కల్పించేందుకు టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తిరుమల, తిరుపతిలో 120 రోజుల ముందుగా ఆన్‌లైన్‌లో గదులు రిజర్వు చేసుకునే అవకాశం ఉంది. భక్తులు ఏ తేదీకి బుక్ చేసుకున్నారో దానికి చివరి రెండు రోజుల ముందు వరకు గదులు రద్దు చేసుకుంటే వంద శాతం అద్దెను తిరిగి చెల్లిస్తారు. ఉదాహరణకు సెప్టెంబరు 5వ తేదీకి గదులు బుక్ చేసుకునే భక్తులు సెప్టెంబరు 3వ తేది ముందుగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్వాన్స్ బుకింగ్ భక్తులు సంబంధిత గదులను రద్దు చేయకపోయినా, వినియోగించుకోకపోయినా ఎలాంటి చెల్లింపులు ఉండవు.
తిరుమలలో ఆన్‌లైన్ ద్వారా గదులు బుక్ చేసుకునే భక్తులు గడువుకు ముందే ఖాళీ చేస్తే జూన్ 15వ తేదీ నుంచి కొంత నగదును టిటిడి తిరిగి చెల్లిస్తోంది. 12 గంటలలోపు ఖాళీ చేసిన వారికి 50 శాతం, 18 గంటలలోపు గదులు ఖాళీ చేసిన వారికి 25 శాతం నగదును 7 పనిరోజులలో సంబంధిత భక్తుల బ్యాంక్ ఖాతాకు తిరిగి జమ చేస్తున్నారు.
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా తిరుమలలోని నందకం వసతి గృహాన్ని కేటాయించారు. రెండు సెషన్లకు కలిపి 500 గదులను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం ఉదయం 10 గంటల స్లాట్, 11 గంటల స్లాట్‌లో వచ్చే భక్తులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గల మొదటి కాలపరిమితిలో(సెషన్) గదిని బుక్ చేసుకోవచ్చు. ఈ సెషన్‌లో గదికి రూ.250/- అద్దె నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలు, 6 గంటల స్లాట్లలో దర్శనానికి వచ్చే భక్తులు రెండో కాలపరిమితిలో(సెషన్) మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు గదిని బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ. 350/- అద్దె నిర్ణయించారు.
సెప్టెంబరు మాసానికి ఇవ్వాల్సిన గదుల కోటాను జూలై 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. నందకం వసతి గృహంలో భక్తులకు ఎలాంటి ఆలస్యం లేకుండా చూసేందుకు వీలుగా మిని కల్యాణకట్ట, క్లాక్‌రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. క్లాక్‌రూమ్‌లో భద్రపరుచుకున్న వస్తువులను తిరిగి అక్కడే పొందే సౌకర్యం కల్పించారు.
Source