నాగలాపురంలో ఘనంగా వేదనారాయణుని బ్రహ్మోత్సవాలు

నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.

స్వామివారు  సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం.

సింహ వాహనంపై యోగ నరసింహుని  అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి కటాక్షం  

    నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం  యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. 

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది.

అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. 

ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి దర్శనం

నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారికి అలంకరించిన ముత్యాలహారాలు శాంతి, ప్రశాంతతను ప్రసాదిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాయి.