చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 12 నుండి 14వ తేదీ వరకు జరుగుతున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహించారు.
అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ జరిగింది. సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్షణ, పవిత్ర విసర్జన, స్నపన తిరుమంజనం, చక్రస్నానం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.