బలిపాడ్యమి ప్రాముఖ్యత ఏమిటి? ఎప్పుడు ఆచరించాలి?

    వ్యాసమహర్షి రచించిన ప్రహ్లాద పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడే బలి చక్రవర్తి. కార్తిక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు గోవర్ధనపూజ చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని, శక్తి కొలది దానం చేయాలని చెబుతారు. దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని పూజించటం కేరళవాసులు సంప్రదాయం. 

కేరళవాసులు బలిచక్రవర్తి కేరళను పాలించాడని నమ్ముతారు. దీపావళి మరుసటి రోజు అయిన కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి వస్తాడని నమ్ముతారు. ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని  బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు ‘బలి పాడ్యమి ‘అయ్యింది.

ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజిస్తారు. బలి చక్రవర్తిని గౌరవిస్తూ దానాలు కూడా చేస్తారు కేరళవాసులు. బలి పాడ్యమి’ రోజున దానం చేస్తే తమకున్న సంపదలు  పెరుగుతాయని నమ్ముతారు.పరమ విష్ణుభక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడవటం వల్ల బలి చక్రవర్తికి విష్ణుభక్తి అబ్బింది. అయితే రాక్షసులకు రాజైన కారణంగా వారిని పాలిస్తూ ఉండేవాడు. అత్యంత జనరంజకంగా పరిపాలన చేసే బలిచక్రవర్తి కాలంలో జనం సుఖసంతోషాలతో జీవించటం వల్ల 'నేను గొప్ప రాజును' అనే అహంకారం అతని మనసును ఆవరించింది. దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్రపదవిని చేపట్టాలని భావించాడు.

వామనావతారంలో బలిని దానం కోరిన విష్ణువు

బలి చక్రవర్తి తాను చేపట్టిన యాగానికి ముల్లోకాల వారిని ఆహ్వానించి, విశేషంగా దానాలు చేసి సంతృప్తి పరుస్తాడు. శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తి గర్వభంగం చేసేందుకు ఏడేళ్ల బ్రాహ్మణ బ్రహ్మచారి బాలుడిగా, గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకుని  వామనావతారంలో ఆ యాగస్థలికి వస్తాడు. ఆ బాలుడిని చూసిన బలి చక్రవర్తి అందరిలాగే ఇతనికి దానం ఇస్తానని అంటాడు.

రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు 'దానాలు కోరుతున్నది శ్రీ మహావిష్ణువనీ, అతను రాక్షసులకు శత్రువనీ, కనుక ఈ బాలుడికి దానం ఇవ్వటం అంటే చావును కోరితెచ్చుకోవటమే' అని బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకు బలి 'అదే నిజమయితే అంతకంటే అదృష్టమేమున్నది! అందరికీ అన్నీ ఇచ్చే విష్ణువుకు దానం చేయటం నాకెంత అదృష్టం' అంటూ గురువు వారించినా వినకుండా, వామనుడిని ఏం కావాలో కోరుకోమని బలి అడుగుతాడు. మూడు అడుగులు నేల ఇప్పించండని అంటాడు వామనుడు. 'సరే తీసుకో' అంటూ వామనుడి చేయి మీద చేయి పెట్టి జలం సాక్షిగా మూడడుగుల నేలను ధారపోస్తాడు.

ఆశ్చర్యకరంగా మూడు అడుగుల ఆ బాలుడు ఆకాశమంత పెరిగిపోతాడు. ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమ్మీద, మరో పాదం ఆకాశం మీద నిలిపి, 'మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?' అనగా, బలి చక్రవర్తి మోకాళ్లమీద కూర్చొని నమస్కరించి 'స్వామీ నా తలపై పెట్టు' అని అనగా, వామనుడి రూపంలో ఉన్న విష్ణువు బలి తలపై పాదం మోపి అతడిని పాతాళానికి అణగదొక్కుతాడు.

పాతాళ లోనానికి రాజుగా బలిచక్రవర్తి 

బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడం వల్ల విష్ణువు అతనిని పాతాళ చక్రవర్తిగా నియమించి, ఏదైనా వరం కోరుకోమని బలిని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి తనకోసం కాకుండా మానవుల కోసం 'తాను దానం చేసిన మూడు అడుగులకు గుర్తుగా, ఏటా మూడు రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి తాను రాజుగా ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. అంతేకాదు ఆ మూడురోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి, దానం చేస్తారో వారికి సకల సంపదను అనుగ్రహించమని బలి విష్ణువును కోరగా విష్ణువు అనుగ్రహిస్తాడు.

ఆ విధంగా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు సాయంకాలం వేళ బలి చక్రవర్తి, విష్ణువుతో కలసి కలసి వస్తాడట. అందుకే ఈ మూడు రోజులు ఆ వేళకి ఇంటిముందు శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాళానికి వెళ్లే ఈ రోజునే బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటున్నాం.

అందుకే బలిపాడ్యమి రోజు సాయంత్రం దీపాలు వెలిగించి, దానాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. రానున్న బలిపాడ్యమి రోజు సాయంత్రం మనం కూడా దీపాలు వెలిగించి దానధర్మాలు చేద్దాం దీర్గాయుషును, అష్టైశ్వర్యాలను పొందుదాం.