వైభ‌వంగా శ్రీ‌వారి గ‌రుడ‌సేవ‌

 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. 

సాయంత్రం 6 గంటల పైన గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ మలయప్ప స్వామిని గరుడుని పై తిలకించి భక్తిపారవస్యంలో పులకించారు.    అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించుకున్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.