తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు ఆలయ ఉత్సవమూర్తులకు 4 ముత్యాల కిరీటాలను విరాళంగా ప్రకటించారు.
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులకు బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అదే విధంగా విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్, యాగశాలలోని హోమగుండాలు, బలిపీఠం ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.