శ్రీభద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా కళ్యాణ మండపంలో సీతరామచంద్రుడికి అర్చకులు పట్టాభిషేకం నిర్వహించారు. ఆదివారం భద్రాచాలంలో శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండుగా జరిగింది. ప్రతీఏటా సీతారాముల వారి కళ్యాణం అనంతరం మహాపట్టాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పట్టాభిషేకంలో భాగంగా రాములవారికి పాదుకలను సమర్పించారు అర్చకులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకాన్ని శ్రీరాముడికి అలంకరించారు. ఆపై ఆ రామయ్యకు కిరీటాన్ని ధరింపచేసారు. ఆ తరువాత వివిధ నదుల తీర్థాలతో సీతారామాచంద్ర భగవనాడుకి అభిషేకం క్రతువును నిర్వహించారు అర్చకులు. మహా పట్టాభిషేక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ రామయ్య పట్టాభిషేకాన్ని వీక్షించి పునీతులయ్యారు. రాత్రికి రథోత్సవం నిర్వహించారు.