
చారిత్రాత్మక కోరుకొండ లక్ష్మినరసింహస్వామి ఆలయ౦ దివ్య కల్యాణ మహోత్సవాలకు ముస్తాబయి౦ది. ఈ నెల 9న అంకురార్పణతో ప్రారంభమై 15వ తేదీ చక్రతీర్థంతో ఉత్సవాలు ముగియనున్నాయి. అన్నవరం దత్తత దేవాలయంగా ఉండడంతో ఆ దేవస్ధానం కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో అనువంశక ధర్మకర్త పరాసర రంగరాజ భట్టర్‌ల పర్యవేక్షణలో కల్యాణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసారు. స్వా మి వారి దిగువ ఆలయం,కొండపైన ఆలయాలు, ఉప ఆలయాలకు,ముఖ ద్వారాలకు మెట్ల మార్గానికి, ఆలయ శిఖరాలకు రంగులు అల౦కరి౦చారు. ఉత్సవాలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసారు.
పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున పెద్ద ఎత్తున భక్తులు దేవుడి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం.ఈ మేరకు కోనేరు వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే షెడ్‌లు ఏర్పాటు చేసారు. అన్నవరం దేవస్థానం సిబ్బంది భక్తులకు స్వామి ప్రసాదంగా లడ్లు సిద్ధ౦చేసారు. ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. సుమారు 16 వరకు హుండీలు ఏర్పా టు చేసారు. అంతే కాకుండా మిరియాల వెంకట రెడ్డి పంతులు ధర్మసత్రంలో ఐదు రోజుల పాటు ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఐదు రోజులు పాటు పండితసభలు ఏర్పాటు చేయనున్నారు.