శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో వివిధ దేవతామూర్తుల కటౌట్లు, దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటుచేస్తోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహనాలు , వాహనసేవలలో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలు అకర్షణియంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన గరుడసేవ రోజున అలంకరించేందుకు లక్ష్మీహారం, గోదాదేవి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చే మార్గాలను ముందస్తుగా సిద్ధం చేస్తున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటు చేస్తున్నారు.