గంగమ్మతల్లిని సేవించడమే కుంభమేళా పరమార్ధం

జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ దాదాపు నలభై అయిదు రోజులపాటు  జరుగుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. గంగమ్మతల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థం. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి ఉద్భవించిన అమృతభాండం కోసం దేవతలు- రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయి. దాంతో ఆ నాలుగు నదులూ అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి. హరిద్వార్‌లోని గంగ, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని  ఈ కారణంగా ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయి. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు.

కుంభమేళా అంటే ఏమిటి?

 బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి కుంభమేళా సమయం నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను రెండు రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా. అర్ధ కుంభమేళాని ఆరేళ్లకోసారి చేస్తారు. మహా కుంభమేళా పన్నెండేళ్లకోసారి వస్తుంది. ఈ పన్నెండేళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహా కుంభమేళానే. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానంచేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహా కుంభమేళా ప్రతిసారీ ఒకేచోట జరగదు. ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమమైనా... వచ్చేసారి బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన మూడు నదుల్లో ఎక్కడైనా జరుగుతుంది. 

కుంభమేళా మొదట ఎవరు ప్రారంభించారు?

చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడనే రాజు కుంభమేళాను క్రీస్తుపూర్వం 644లో ప్రారంభించాడని తెలుస్తోంది. మరో కథ ప్రకారం... జగద్గురువు ఆదిశంకరాచార్యులు... దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్నీ, ఆధ్యాత్మిక వేత్తల్నీ, సాధువుల్నీ కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేరని, అదే కుంభమేళాగా మారిందనీ ప్రచారంలో వుంది. కోట్లాది జనం ఉన్నా అత్యంత ప్రశాంతంగా, అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళా ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు. సామాన్యులతో పాటుగా అపర శివ-విష్ణు భక్తులైన ఆఘోరాలూ, సాధువులూ, ఆధ్యాత్మిక వేత్తలూ, పండితులూ... ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణీ సంగమంలో ఉండే ఘాట్‌లలో నదీమతల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ప్రతిఏటా ఈ మాసంలో మాఘ్‌మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు నలభైరోజులు సాగే ఈ మాఘ్‌మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షలమంది భక్తులు ఇక్కడకు చేరతారు. వీళ్లంతా ఈ నలభైరోజులూ ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు.