సాలకట్ల బ్రహ్మోత్సవాలు: అక్టోబరు 4 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

ప్రతినిత్యం గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు స్వయంగా వైకుంఠం నుంచి దిగివచ్చే రోజులు కావడంతో ఆశ్వయుజమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అంత ప్రాధాన్యం. 

తిరుమల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వస్వామికి నిత్యం ఏదో ఒక సేవ, ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. 

బ్రహ్మోత్సవాల వివరాలిలా...

  • అక్టోబరు 3న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు.
  • అక్టోబరు 4న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బంగారు తిరుచ్చి ఉత్సవం, ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 -11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామి వారు ఉరేగుతారు.
  • అక్టోబరు 5 న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహనం, సాయంత్రం హంస వాహనంపై శ్రీవారు విహరిస్తారు.
  • అక్టోబరు 6న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవరోజు ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరిస్తారు.
  • అక్టోబరు 7 న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ జరుగుతుంది. అలాగే ఈ రోజు ఉపాంగ లలితా వ్రతం కూడా దేవీ ఉపాసకులు జరుపుకుంటారు.
  • అక్టోబరు 8 నశ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది.
  • అక్టోబరు 9 న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆరవరోజు ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రి గజ వాహన సేవ జరుగుతుంది.
  • అక్టోబరు 10న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది.
  • అక్టోబరు 11 నశ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు.
  • అక్టోబరు 12 నశ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదో రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం, అనంతరం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి.